కరోనా వైరస్ రెండో దఫా విజృంభణతో భారత్ సతమతమవుతోంది. అయితే మొదటి దఫాతో పోలిస్తే ఈసారి రోగులకు అధికస్థాయిలో ప్రాణవాయువు అవసరమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య తొలి, రెండో దఫాలో ఎటువంటి తేడా లేదని పేర్కొంది. ఇక కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిలో 70శాతం మంది రోగులు 40 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
దేశంలో కరోనా వైరస్ తొలిదఫా విజృంభణతో పోలిస్తే రెండో దఫాలో వైరస్ బారినపడుతున్న వారిలో కొన్ని భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా చాలామంది రోగులు శ్వాస ఆడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువైనట్లు పేర్కొంది. తొలిదఫాలో 41.5శాతం రోగులకు ఆక్సిజన్ అవసరం కాగా.. సెకండ్ వేవ్‌లో అది 54.5 శాతంగా ఉంది. వెంటిలేటర్ అవసరం మాత్రం సెకండ్ వేవ్‌లో తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది. తొలి దఫా విజృంభణలో పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలను ఎక్కువగా చూశామని నీతిఆయోగ్ సభ్యులు వీకే పాల్ పేర్కొన్నారు.