Opposition Meeting In Delhi :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం మంగళవారం దిల్లీలో జరగనుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడానికి అవసరమైన ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కూటమి ఎజెండాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై నిరసన తెలిపిన 78మంది విపక్ష ఎంపీలపై సోమవారం ఉభయ సభల్లో వేటు పడింది. ఈ నేపథ్యంలో దిల్లీలో జరిగే విపక్ష ఇండియా కూటమి నేతల భేటి కీలకం కానుంది. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడమే కాకుండా సస్పెన్షన్‌పై భవిష్యత్ కార్యచరణను ఈ భేటిలో చర్చించే అవకాశాలున్నాయి.
Opposition Meeting Mamata Banerjee :విపక్ష కూటమి సమావేశానికి ఒక రోజు ముందుగానే దేశ రాజధాని దిల్లీకి టీఎంసీ ఛైర్‌పర్సన్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే కూటమి తరఫున ప్రధాని మంత్రి ఎవరో నిర్ణయిస్తామన్నారు. విపక్షాల విజయంపై భరోసా వ్యక్తం చేశారు. కూటమి అన్ని సమస్యలను అధిగమించి బీజేపీని ఓడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాల పొత్తు సాధ్యమేనని, దీనిపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే మూడోసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న బీజేపీ ఆశలు నెరవేరబోవని విలేకరులతో సమావేశంలో మమతా బెనర్జీ తెలిపారు. అయితే బీజేపీ బలంగా లేదని తాము కొంచెం బలహీనంగా ఉన్నామని చెప్పారు. దాన్ని అధిగమించడాని తాము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
India Alliance Latest News :ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపడతారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చారు. మోదీని అధికారం నుంచి 'ఇండియా' కూటమి తొలగిస్తుందని పేర్కొన్నారు. విపక్ష కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి దిల్లీ వెళ్తునప్పుడు లాలూ ప్రసాద్ పట్నా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించేలా వ్యూహాన్ని రచించేందుకు ఇండియా కూటమి మంగళవారం దిల్లీలో భేటీ కానుందని చెప్పారు. విపక్ష కూటమి విజయం సాధిస్తుందన్న భరోసా వ్యక్తం చేశారు.