Onion Price Hike :దేశంలోని రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర ఒక్కసారిగా 57 శాతానికి పెరిగింది. దీంతో వినియోగదారులుకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. నిల్వ ఉంచిన ఉల్లి స్టాక్‌ను సబ్సిడీ కింద అమ్మేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గతేడాది ఇదే సమయంలో రూ.30గా ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.47కు చేరుకుంది.
సబ్సిడీ@రూ.25..!
ఉల్లి ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం.. కిలోకు రూ.25ల సబ్సిడీ కింద రిటైల్ మార్కెట్‌లలో దీనిని విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.
దిల్లీలో ఉల్లి ధర..
Onion Price In Delhi :దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో సగటు ఉల్లి ధర శుక్రవారం రూ.47గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 పలుకుతోంది. ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు బఫర్(నిల్వ) స్టాక్ ఎక్కువగా ఉన్న గోదాముల నుంచి ఉల్లిని ఆయా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
"నిల్వ ఉంచిన ఉల్లిపాయల గోదాముల నుంచి స్టాక్ క్రమంగా ధరలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు తరలివెళ్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టు మధ్యలో ప్రారంభించాం. ధరలను నియంత్రించడానికి, అలాగే వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మేము సబ్సిడీ రిటైల్ విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశాం. ఇప్పటివరకు 22 రాష్ట్రాలకు సుమారు 1.7 లక్షల టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేశాము."