వీధి కుక్కల దాడిలో ఓ ఏడాది చిన్నారి మంగళవారం మృతిచెందాడు. చనిపోయిన పసికందును ఉత్తర ప్రదేశ్ నొయిడాలో లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో పని చేసే కార్మికుడి కొడుకుగా పోలీసులు గుర్తించారు.
నొయిడా లోటస్ బౌలేవార్డ్ సొసైటీ ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో చిన్నారి తల్లిదండ్రులు పని చేస్తున్నారు. ఆ సమయంలో చిన్నారి తన సోదరుడితో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా మూడు కుక్కలు బాలుడిపై దాడి చేయగా అతని సోదరుడు కేకలు పెట్టాడు. దీంతో పనిలో ఉన్న బిడ్డ తల్లిదండ్రులతో పాటు మరి కొందరు హుటాహుటిన అక్కడికి చేరుకుని పిల్లాడ్ని రక్షించారు.
ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. చిన్నారి కడుపుపై 25 చోట్ల కుక్కలు కరిచాయని వైద్యులు తెలిపారు. ఈ కేసును అసహజ మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మున్సిపల్ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.