Cheetah Death In Kuno : మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. 'ధాత్రి' అనే ఆడ చీతా మరణించినట్లు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. మరణానికి గల కారణం పోస్టుమార్టమ్ పరీక్షల ఫలితాల అనంతరం తెలుస్తుందని తెలిపింది. కాగా, మార్చి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది చీతాలు మరణించాయి.
'ప్రాజెక్టు చీతా'లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించారు. వాటిలో ధాత్రితో కలిపి ఆరు పెద్ద చీతాలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు జన్మించగా.. అందులో మూడు ప్రాణాలు కోల్పోయాయి. ఫలితంగా మొత్తం చీతా మరణాల సంఖ్య తొమ్మిదికి చేరినట్లైంది. జీవించి ఉన్న పిల్ల చీతాను నిపుణుల సమక్షంలో పెంచుతున్నారు.
దేశంలో చీతాల సంఖ్యను వృద్ధి చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామాలు ఆటంకంగా నిలిస్తున్నాయి. ప్రస్తుతం కునో పార్కులో ఇంకా 14 చీతాలు ఉన్నాయి. వాటిలో ఏడు మగవి కాగా, ఆరు ఆడవి, ఒక ఆడ చీతా పిల్ల ఉంది. వాటిని ఎన్‌క్లోజర్‌లో ఉంచి పరిరక్షిస్తున్నారు. వీటిలో ఒక ఆడ చీతాను ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వదిలి నిశితంగా పరిశీలిస్తున్నారు. దానిని తిరిగి ఎన్‌క్లోజర్‌లోకి తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలను చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు వివరించారు.
మోదీని విమర్శిస్తూ జైరాం రమేశ్ ట్వీట్!
అయితే, చీతాలు వరుసగా మృతి చెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్‌కు, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే జరిగేది ఇదేనంటూ వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తి గర్వం, వ్యక్తిగత ప్రతిష్ఠకు పెద్ద పీట వేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ప్రాజెక్ట్ చీతా
భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చీతాలు.. భారత్‌లో 74 ఏళ్ల క్రితమే కనుమరుగైపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో చీతాలను తిరిగి ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మొదటి విడత కింద గతేడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు.