Omicron cases in India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. రాజస్థాన్‌లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరింది. కొత్త కేసుల్లో జైపుర్‌లో 11, అజ్మేర్లో 6, ఉదయ్పుర్లో 3, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడిన వారిలో ఐదుగురు విదేశాల నుంచి రాగా.. వారితో కలిసిన ముగ్గురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
దిల్లీలో 12 కేసులు
దేశ రాజధానిలో కొవిడ్-19, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. అందులో 23 మంది వైరస్‌ను జయించారు.
కేరళలో 8
కేరళలో శుక్రవారం మరో 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 37కు చేరినట్లు ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ తెలిపారు. తిరువనంతపురమ్, కొల్లాంలో ఒక్కొక్కరు, అలప్పూజా, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లో ఇద్దరి చొప్పున వైరస్ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ సోకిన తొలి వ్యక్తి కోలుకున్నారని తెలిపారు.
దేశంలో 436కు చేరిన సంఖ్య
మూడు రాష్ట్రాల్లో కొత్తగా 41 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన క్రమంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 436కు చేరింది. మొత్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 108 మంది ఒమిక్రాన్ బారినపడగా.. ఆ తర్వాత దిల్లీలో 79, గుజరాత్- 43, రాజస్థాన్- 43, తెలంగాణ- 38, కేరళ- 37, తమిళనాడు- 34, కర్ణాటక- 31 కేసులు వచ్చాయి.
దేశంలో ఇప్పటివరకు 115 మంది ఒమిక్రాన్‌ను జయించారు.
వైద్య కళాశాలలో వైరస్ కలకలం
కర్ణాటక, కోలార్‌లోని వైద్య కళాశాలలో కొవిడ్-19 కలకలం సృష్టించింది. 33 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఆసుపత్రిలోనే విద్యార్థులందరిని ఐసోలేషన్‌కు పంపించినట్లు చెప్పారు.