Omicron Cases In Delhi: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దిల్లీలో ఒమిక్రాన్ కేసులు మరో 63 నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా 152 కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 578కి చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 151 మంది కోలుకున్నారు.
మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి దిల్లీ తొలి స్థానానికి చేరింది. దిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కేరళలో 57, గుజరాత్లో 49, రాజస్థాన్లో 43, తెలంగాణలో 41 కేసులు నమోదు అయ్యాయి.
Night Curfew In Delhi
దేశ రాజధాని దిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాత్రి 11 నుంచి ఉదయం ఐదింటి వరకు జనసంచారంపై ఆంక్షలు విధించనున్నారు.