Odisha Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. వారందరికీ తీవ్ర రక్తస్రావం జరిగింది. వారికి చికిత్స చేసేందుకు రక్తం అత్యవసరమైంది. వైద్యులకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. పోలీసులు, స్థానికులు పెద్ద మనసు చాటుకున్నారు. అర్ధరాత్రి వేళ మనకెందుకులే అని అనుకోకుండా.. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రులకు వేలల్లో తరలివచ్చారు. బాలేశ్వర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు రెండు వేల మంది ప్రజలు ముందుకు వచ్చారు. మిగిలిన ఆస్పత్రుల్లోనూ వందల మంది స్థానికులు, పోలీసులు.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అర్ధరాత్రి వేళ ప్రజలు రక్తదానం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావడం చూసి వైద్యులు, అధికారుల కళ్లు చెమర్చాయి.
Odisha Blood Donation : బాలేశ్వర్‌లో అర్ధరాత్రి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించగా.. తొమ్మిది వందల యూనిట్ల రక్తం స్టాక్‌లో ఉందని వైద్యులు తెలిపారు. రక్తదానం చేసేందుకు ప్రజలు ఇంకా తరలివస్తున్నారని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. ప్రమాదంలో బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన ప్రజలకు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. క్లిష్ట సమయంలో మీరు చేసిన రక్తదానాన్ని మరచిపోమంటూ ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా భావోద్వేగానికి గురయ్యారు. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఈ రక్తం చాలా ఉపయోగపడుతోందని, స్వచ్ఛంద సేవకులందరికీ రుణపడి ఉంటాననని ఒడిశా సీఎస్ వెల్లడించారు.
"ప్రమాద స్థలంలో 200కు పైగా అంబులెన్సులు ఉన్నాయి. సుమారు 75 మందితో కూడిన వైద్యుల బృందాన్ని సైతం అందుబాటులో ఉంచాం. ప్రభుత్వ యంత్రాంగమంతా ఘటనా స్థలంలోనే ఉంది. ఒక బోగీ తీవ్రంగా ధ్వంసమైంది. దానిని కట్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్, ఫైర్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతదేహాల శవపరీక్షల అనంతరం వారి బంధువులకు అప్పగిస్తాం."
--పీకే జెనా, ఒడిశా సీఎస్