Odisha Train Crash : ఒడిశాలో ప్రమాదానికి గురైన రైలులో ఉన్న జాతీయ విపత్తు స్పందన దళం-ఎన్డీఆర్ఎఫ్ జవాను.. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తిని, సాహసాన్ని కనబరిచారు. దుర్ఘటన సమాచారాన్ని అందరికన్నా ముందుగా అధికారులకు అందించి.. సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు ప్రారంభమయ్యేలా చూశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది క్షతగాత్రుల ప్రాణాలు నిలిచేందుకు కారణమయ్యారు.
సెలవు పెట్టి సొంతూరు వెళ్తూ..
ఎన్.కె. వెంకటేశ్ (39) తమిళనాడు వాసి. సరిహద్దు భద్రతా దళం-బీఎస్ఎఫ్లో పని చేసేవారు. 2021లో ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ అయ్యారు. కోల్‌కతాలోని ఎన్డీఆర్ఎఫ్ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే వెంకటేశ్.. తమిళనాడులోని స్వస్థలం వెళ్లేందుకు సెలవు పెట్టారు. బంగాల్లోని హావ్‌డా నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై బయలుదేరారు.
మరికొన్ని గంటల్లో కుటుంబసభ్యుల్ని కలుస్తానన్న ఆనందంతో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్‌కు శుక్రవారం సాయంత్రం అనూహ్య పరిస్థితి ఎదురైంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఘోర ప్రమాదానికి గురైంది. అయితే.. వెంకటేశ్ ఉన్న బీ-7 బోగీ పట్టాలు తప్పినా ఇతర కోచ్‌లను ఢీకొట్టలేదు. ఫలితంగా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
యాక్సిడెంట్ షాక్ నుంచి వెంకటేశ్ వెంటనే కోలుకున్నారు. కోల్‌కతా ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయంలోని తన సీనియర్ ఇన్స్పెక్టర్కు కాల్ చేశారు. ఏం జరిగిందో చెప్పారు. ప్రమాద తీవ్రతను తెలియజేసేలా కొన్ని ఫొటోలు తీసి పంపారు. దుర్ఘటన ఎక్కడ జరిగిందో సులువుగా తెలుసుకునేందుకు వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్ షేర్ చేశారు. వెంకటేశ్ సమాచారంతో కోల్‌కతాలోని ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక యంత్రాంగం సహా సంబంధిత విభాగాలు అన్నింటినీ అలర్ట్ చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు.