తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పచ్చళ్లు అమ్ముతూ.. కొవిడ్ బాధితులకు బామ్మ సాయం - కొవిడ్ 19

ఆ బామ్మ వయసు 87 ఏళ్లు. కరోనా కారణంగా ఇటీవలే భర్తను కోల్పోయారు. ఈ సమయంలో మానసికంగా కుంగిపోకుండా.. నలుగురికి అండగా నిలవాలని అనుకున్నారు. వేలాది మంది ఆకలి తీర్చి అన్నపూర్ణ అనిపించుకుంటున్నారు.

usha gupta
ఉషా గుప్తా

By

Published : Aug 10, 2021, 12:20 PM IST

ఉషా గుప్తా

87 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చెస్తారు. ఇంటి పట్టున ఉండి.. మనవళ్లు, మనవరాళ్లకు కథలు చెప్పడం తప్ప! కానీ దిల్లీకి చెందిన ఓ బామ్మ.. అలా చేయలేదు. తనకు చేతనైన సాయం చేయాలని నిశ్చయించుకున్నారు. పచ్చళ్లు అమ్ముతూ సంపాదించిన కొద్ది మొత్తాన్ని సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు ఉషా గుప్తా. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెడుతున్నారు. ఇలా 65 వేల భోజనాలను అన్నార్తులకు అందించారు. గత నెలలో రోజుకు సగటున 2,500 మీల్స్​ను దిల్లీ స్లమ్ ఏరియాలలో పంచి పెట్టారు. ఓ ఎన్​జీఓ సాయంతో కోల్​కతాలోనూ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

తన భర్తను కోల్పోయిన తర్వాత ఈ సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఉషా గుప్తా. కరోనా రెండోవేవ్​కు ముందు తన భర్త రాజ్​ కుమార్​తో కలిసి దిల్లీలోని కూతురి ఇంటికి వచ్చిన సమయంలో దంపతులిద్దరూ వైరస్ బారిన పడ్డారు. కరోనా నుంచి ఉషా గుప్తా కోలుకున్నప్పటికీ.. 93 ఏళ్ల రాజ్​ కుమార్... ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో అక్కడి పరిస్థితులను గమనించిన అనంతరం.. వైరస్ బాధితులకు సాయం చేయాలని నిశ్చయించుకున్నారు ఉషా గుప్తా. తన మనవరాలు నడిపించే ఎన్​జీఓ సాయంతో పచ్చళ్లు విక్రయించి.. ఆ డబ్బుతో అవసరమైనవారికి సాయం అందిస్తున్నారు.

"నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు కరోనా వార్డులో 27 మంది ఉన్నారు. అక్కడ చాలా మందికి ఎవరూ లేరు. కొంతమందికి.. తమను చూసేందుకు వచ్చేవారు కరవయ్యారు. ఆ తర్వాత నేను ఇంటి కొచ్చి ఆలోచించాను. నా వల్ల అయిన సాయం చేయాలనుకున్నా. తోచినన్ని డబ్బులు ఇచ్చేందుకు ఎన్​జీఓలను సంప్రదించా. కానీ వారు డబ్బు తీసుకోరని నా కూతురు చెప్పింది. పచ్చళ్లు అమ్మాలని నాకు సూచించింది. అప్పుడే నేను పచ్చళ్లు చేయడం ప్రారంభించా. ఆర్డర్లు రావడం మొదలైంది. సముద్రంలో నీటి చుక్కలా.. నా వల్ల కరోనా బాధితులకు ఉపశమనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించా."

-ఉషా గుప్తా

కరోనాను విజయవంతంగా జయించిన ఉషా గుప్తా.. అవసరంలో ఉన్నవారికి సాయం చేసేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. ఖాళీ సమయంలో తన చుట్టుపక్కల వారికి వంటలు తయారు చేయడం, ఇతర ఇంటి పనుల విషయంలో మెలకువలు నేర్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ వయసులోనూ తమ బామ్మ ఇతరుల గురించి ఆలోచించడాన్ని చూసి గర్వపడుతున్నట్లు ఉషా మనవరాలు రాధికా బత్రా చెబుతున్నారు. చాలా మందికి ఇది స్ఫూర్తినిస్తుందని అన్నారు.

ప్రస్తుతం ఈ బామ్మ నాలుగు రకాల పచ్చళ్లు తయారు చేస్తున్నారు. అందమైన జాడీకి తోడుగా ఓ చీటీపై ఆశీర్వచనాన్ని రాసి వినియోగదారులకు పచ్చళ్లను అందిస్తున్నారు. కొవిడ్ అదుపులోకి వచ్చినా.. ఏదో రకంగా సాయం చేస్తూనే ఉంటానని చెబుతున్నారీ బామ్మ.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details