"నేను యూట్యూబ్ చూస్తుంటే అసభ్యకరమైన ప్రకటనలు వస్తున్నాయి. దీంతో నేను చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నాను. పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోతున్నాను. తద్వారా నేను నష్టపోయాను. అందుకు నాకు యూట్యూబ్ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించండి" అంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని, వాటిపైనా నిషేధం విధించాలని సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువకుడు కోరాడు.
"యూట్యూబ్‌లో బూతు యాడ్స్.. చదవలేక నా ర్యాంక్ మిస్".. పిటిషన్ వేసిన యువకుడికి కోర్టు షాక్
యూట్యూబ్ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. యూట్యూబ్ చూస్తుంటే అసభ్యకరమైన ప్రకటనలు వస్తున్నాయని ఆ యువకుడు వేసిన దావాను పరిశీలించిన కోర్టు.. తమ సమయం వృథా చేశారంటూ పిటిషనర్‌కు రూ.25వేలు జరిమానా విధించింది.
శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. విచారణకు నిరాకరించింది. పిటిషనర్‌కు చీవాట్లు పెట్టి, కోర్టు సమయం వృథా చేశారంటూ లక్ష రూపాయలను జరిమానా విధించింది. "నీకు ప్రకటనలు నచ్చకపోతే చూడకు. యూట్యూబ్‌లో ప్రకటనలు చూడాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే." అని సుప్రీం కోర్టు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
"నీలాంటి వాళ్లు కేవలం పబ్లిసిటీ కోసమే ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తారు" అని పిటిషనర్‌పై న్యాయస్థానం మండిపడింది. లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని అతడ్ని ఆదేశించింది. అనంతరం హిందీలో తన వాదనలు వినిపించాడు ఆ యువకుడు. క్షమించాలంటూ కోర్టును కోరాడు. తాను నిరుద్యోగినని, అంత సొమ్ము తాను కట్టలేనని వేడుకున్నాడు. కోర్టు స్పందిస్తూ.. ఫైన్ తగ్గిస్తాము కానీ నిన్ను మాత్రం క్షమించము అని వ్యాఖ్యానించింది. మళ్లీ ఇలాంటి పనులు చేయకంటూ జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది.