కేంద్ర జాబితాలోని ఓబీసీలకు చెందిన 2,633 కులాలను 4 కేటగిరీలుగా వర్గీకరించాలని జస్టిస్ రోహిణి కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓబీసీలకు అమలవుతున్న 27% రిజర్వేషన్లను ఈ నాలుగు కేటగిరీలకు 2:6:9:10 నిష్పత్తిలో పంచాలని కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేంద్ర జాబితాలోని ఓబీసీ రిజర్వేషన్లు ఎలాంటి వర్గీకరణ లేకుండా గంపగుత్తగా అమలవుతున్నాయి. దీనివల్ల ఓబీసీల్లోని కొన్ని బలమైన వర్గాలు మాత్రమే వాటి ప్రయోజనాలను పొందుతున్నాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటి వర్గీకరణకు 2017 అక్టోబరు 2న జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
2018 మార్చి 27కల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం తొలుత నిర్దేశించింది. అయితే తర్వాత సార్వత్రిక ఎన్నికలతోపాటు, వివిధ రాజకీయ అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆ కమిషన్ గడువును పొడిగించుకుంటూ 2021 జులై 31లోపు నివేదిక సమర్పించడానికి గడువును నిర్దేశించింది.