Bulldozer Action In Haryana : అల్లర్లతో ఇటీవల రణరంగంగా మారిన హరియాణాలోని నూహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు. శుక్రవారం కూడా తావ్‌డూ పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించారు. తాజాగా శనివారం ఉదయం సైతం నల్హార్ ప్రాంతంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు అధికారులు.
ఆసుపత్రి వద్ద ఉన్న మెడికల్ షాపులు, ఇతర దుకాణాలను కూల్చివేశారు అధికారులు. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 50 నుంచి 60 నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు వివరించారు. అరెస్టులు చేస్తారని భయంతో ఈ దుకాణాదారులు అక్కడి నుంచి పారిపోయినట్లు వారు వెల్లిడించారు.
నూహ్‌లో 250 గుడిసెల కూల్చివేత..
నూహ్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టడం పలు అనుమానాలు తావిస్తోంది. అల్లర్లకు పాల్పడ్డ నిందితులను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారని.. వారి అక్రమ నిర్మాణాలనే అధికారులు ఇప్పుడు నేలమట్టం చేశారనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలనేనని, వాటిని తొలగించేందుకు ఇదివరకే నోటీసులు ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. అల్లర్లకు ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు.