బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్త మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి నుంచి ఊహించినట్లుగానే భాజపా నేత షానవాజ్ హుస్సేన్‌కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. షానవాజ్, జమాఖాన్ నియామకంతో మంత్రి వర్గంలో ముస్లిం నేతలు లేరనే విమర్శలకు తెరదించే ప్రయత్నం చేశారు.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. దీంతో కేబినెట్ సంఖ్య 34కు చేరుకుంది. కేబినెట్లో భాజపా తరపున 20 మంది ఉండగా, జేడీయూ 12 మందితో సరిపెట్టుకుంది. గతేడాది నవంబరులోనే కూటమిలో ఇతర పార్టీలైన హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం), వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీల నుంచి చేరో నేత కేబినెట్లో స్థానం సంపాదించారు.
"శాఖల కేటాయింపులపైనా తుది నిర్ణయం తీసుకున్నాం. ప్రకటన ద్వారా త్వరలో ఆ విషయాలు వెల్లడిస్తాం."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి