దేశంలో వరదల కారణంగా ప్రతి ఏడాదికి సగటున రూ.5,694 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 7.17 మిలియన్ హెక్టార్ల ప్రాంతం వరద ప్రభావానికి గురవుతోంది. అందులో 3.94 మిలియన్ హెక్టార్లు పంట పొలాలున్నట్లు పేర్కొంది. 12 లక్షల గృహాలు వరదల్లో చిక్కుకుపోతున్నట్లు తెలిపింది. వీటన్నింటి కారణంగా 1953 నుంచి 2018 వరకు ఏటా సగటున రూ.5,694 కోట్ల ఆర్థిక నష్టం చోటుచేసుకుంటున్నట్లు వెల్లడించింది. దేశంలో వరదలు, నదుల నిర్వహణపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందం అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విపత్తు నివారణకు గాను 2021-26 మధ్య తీసుకోవాల్సిన చర్యలను సూచించింది.
"వరద సమస్యను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చర్యలు చేపట్టాలి. వరదను ముందుగా అంచనా వేయడం, ఏ ప్రాంతంలో దాని తాకిడి ఉంటుందో గుర్తించి ఆ ప్రాంతాన్ని తాకకుండా చేయడంలాంటి పనులు చేపట్టాలి. చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిర్మించి నదులపై నీటి ఒత్తిడిని తగ్గించాలి. రైల్వేలైన్లు, జాతీయరహదారులు, విలువైన వస్తువులు, అంతర్జాతీయ సరిహద్దులను వరదల నుంచి రక్షించడానికి కరకట్టల నిర్మాణం చేపట్టాలి. నదీ పరివాహక ప్రాంతంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాతే కరకట్టల నిర్మాణాన్ని మొదలుపెట్టాలి. ముందస్తు హెచ్చరికలు జారీచేయడానికి వీలుగా కృత్రిమ మేథ, శాటిలైట్లు, రిమోట్‌సెన్సింగ్, జీఐఎస్‌ను విస్తృతంగా ఉపయోగించాలి."