తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్‌కు అప్పగింతపై సుప్రీంకోర్టుకు వెళ్తా'.. లండన్​ హైకోర్టును అనుమతి కోరిన నీరవ్‌ మోదీ - NIRAV MODI scam

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్​కు అప్పగించాలని లండన్​ హైరోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును యూకే సుప్రీం కోర్టులో సవాల్​ చేసేందుకు అనుమతించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు నీరవ్​. దీంతో ఆయనను భారత్​కు రప్పించడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది.

NIRAV MODI news
NIRAV MODI news

By

Published : Nov 24, 2022, 3:11 PM IST

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్‌కు అప్పగించాలన్న తీర్పును యూకే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ లండన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ఇటీవలే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముప్పు ఉందన్న కారణంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించకుండా ఉండటం సరికాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేరకు మోసగించి నీరవ్‌ మోదీ బ్రిటన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే.

నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గతేడాది అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో తాజాగా ఆయన అందుకు అనుమతి కోరారు. అక్కడ కూడా ఆయనకు ప్రతికూల నిర్ణయం వెలువడితే.. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ నుంచి 39వ రూల్‌ను కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశంతో నీరవ్‌ తనను భారత్‌కు అప్పగించకుండా ప్రభుత్వానికి వినతి చేసుకోవచ్చు. దీంతో నీరవ్‌ను భారత్‌కు రప్పించే విషయంలో సందిగ్ధం వీడడానికి మరికొంత కాలం పట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details