Nipah Virus In Kerala : కొవిడ్ కంటే నిఫా వైరస్ చాలా ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. కొవిడ్ సోకిన వారిలో 2-3 శాతం మరణాలు మాత్రమే సంభవిస్తాయని.. కానీ నిఫా వైరస్ వల్ల 40-70 శాతం మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు చేపడుతున్నామని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ తెలిపారు. కేరళలో నిఫా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇంకా తెలియలేదని ఆయన పేర్కొన్నారు.
"ప్రస్తుతం ఐసీఎంఆర్ వద్ద 10 మంది రోగులకు సరిపడే మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ఉంది. మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తాం. 2018 నుంచే మోనోక్లీనల్ యాంటీబాడీ మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తున్నాం. భారత్‌లో ఇప్పటివరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మందును ఇవ్వలేదు. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలోనే ఉండగానే ఈ మందు ఇవ్వాలి. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. గబ్బిలాల నుంచి మానవుడికి నిఫా వైరస్ వ్యాపించినట్లు 2018లో కనుగొన్నాం. కానీ వ్యాధి గబ్బిలాల నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కచ్చితంగా తెలీదు. ఇప్పుడు వ్యాధి సంక్రమణ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం."
--రాజీవ్ బాల్, ఐసీఎంఆర్ డీజీ
వర్షాకాలంలోనే ఎక్కువగా నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ తెలిపారు. ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న 14 మంది నిఫా రోగులకు మోనోక్లోనల్ యాంటీబాడీ మందును అందించారని.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. నిఫా రోగులకు యాంటీబాడీ మందును ఉపయోగించాలనే నిర్ణయం.. వైద్యులు, రోగులు, వారి కుటుంబాలతో పాటు కేరళ ప్రభుత్వానిదే అని వివరించారు. నిఫా వైరస్‌ను అరికట్టేందుకు చేతులు కడుక్కోవడం, మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని కోరారు.