Newsclick Office Raid :మనీ లాండరింగ్‌తోపాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్‌పై.. దిల్లీ పోలీసులు మరో కొత్త కేసు నమోదు చేశారు. ఆ సంస్థకు చెందిన దిల్లీ కార్యాలయంతో పాటు దేశ రాజధాని ప్రాంతం- ఎన్సీఆర్లోని న్యూస్‌క్లిక్ సిబ్బంది నివాసాలతో సహా 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూస్ క్లిక్‌కు చెందిన కొందరు జర్నలిస్టుల ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుంచి డేటా తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొందరు జర్నలిస్టులతో పాటు సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కాయస్థను దిల్లీ ప్రత్యేక విభాగం కార్యాలయానికి తీసుకెళ్లారు.
అయితే ఇంతవరకు ఎవరినీ కూడా అరెస్ట్ చేయలేదని అధికారవర్గాలు తెలిపాయి. పోలీసు దాడుల విషయాన్ని ఇద్దరు జర్నలిస్టులు ధ్రువీకరించారు. తమ ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు న్యూస్‌క్లిక్‌కు ఫండింగ్ ఎక్కడినుంచి వస్తుందనే విషయమై దిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు, ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బిహార్ కులగణన ద్వారా బయటపడిన సంచలన విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ పెరుగుతోందని, దీన్ని కప్పిపుచ్చేందుకు దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. దిల్లీ పోలీసు దాడులపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.