నీట్ పీజీ పరీక్ష 4 నెలల పాటు వాయిదా - కొవిడ్ విధులు
15:14 May 03
నీట్ పీజీ పరీక్ష 4 నెలల పాటు వాయిదా
కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చొట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. మానవ వనరుల కొరతపై ఆదివారం సమీక్ష నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు..
- పెద్ద సంఖ్యలో వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్-పీజీ పరీక్ష కనీసం నాలుగు నెలల పాటు వాయిదా. ఆగస్టు 31 వరకు పరీక్ష నిర్వహించకూడదని నిర్ణయం.
- ఎంబీబీఎస్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులను.. అధ్యాపకుల పర్యవేక్షణలో టెలీకన్సల్టేషన్, స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్ కేసుల చికిత్స వంటి సేవల్లో వినియోగించుకునేందుకు అంగీకారం.
- మెడికల్ ఇంటర్న్లు వారి అధ్యాపకుల పర్యవేక్షణలో పని చేసేందుకు అనుమతి.
- బీఎస్సీ, జీఎన్ఎం ఉత్తీర్ణత సాధించిన నర్సులను సీనియర్ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో.. ఫుల్‌టైం కొవిడ్ నర్సింగ్ విధుల్లోకి తీసుకోవటం.
- 100 రోజులు కొవిడ్ విధుల్లో సేవలందించిన పీజీ వైద్య విద్యార్థులకు.. ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం.
- కొవిడ్ సంబంధిత విధుల్లో సేవలందించే వైద్య విద్యార్థులు, నిపుణులకు వ్యాక్సిన్ అందించటం.
- 100 రోజులు కొవిడ్ విధులను పూర్తి చేసిన వైద్య సిబ్బందికి ప్రధానమంత్రి విశిష్ట కొవిడ్ నేషనల్ సర్వీస్ సమ్మాన్ పురస్కారంతో సత్కారం.
- కొవిడ్ సేవల్లో పాల్గొన్న వైద్య విద్యార్థులు, నిపుణులందరికీ ప్రభుత్వ బీమా పథకం వర్తింపజేయటం.