NEET PG Exam EWS Quota: నీట్ పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన పిటిషన్లపై బుధవారం అత్యవసర విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారాన్ని బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
నీట్ పీజీ కౌన్సెలింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు జడ్జీలతో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.
అంతకుముందు ఇదే విషయంపై విచారణ చేపట్టాలని కేంద్రం.. సుప్రీంకోర్టును కోరింది. మంగళవారం ఈ వ్యాజ్యాలను విచారణ జరపాలని అభ్యర్థించింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు.
Resident Doctors Protest: వాస్తవానికి ఈ వ్యాజ్యాలపై విచారణ జనవరి 6న జరగాల్సి ఉంది. అయితే.. నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యానికి వ్యతిరేకంగా.. దిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ఇటీవల ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరినట్లు తెలుస్తోంది. తొలుత నవంబర్ 27న నిరసనకు దిగిన రెసిడెంట్ వైద్యులు.. అనంతరం సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే డాక్టర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది.