తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహారాష్ట్రను, దేశాన్ని మతపరంగా విభజించే శక్తులపై పోరాటం' - సంజయ్ రౌత్

NCP Chief Sharad Pawar : ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రను, దేశాన్ని మతపరంగా విభజించే శక్తులపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సతారా జిల్లాలోని కరాడ్​లో పార్టీ శ్రేణులను, మద్దతుదారులను ఉద్దేశిస్తూ మాట్లాడిన శరద్​ పవార్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ncp-chief-sharad-pawar-said-need-to-fight-forces-creating-communal-divide
శరద్ పవార్ ఎన్సీపీ అధినేత

By

Published : Jul 3, 2023, 1:38 PM IST

Updated : Jul 3, 2023, 2:05 PM IST

Sharad Pawar On Maharashtra Crisis : మహారాష్ట్రను, దేశాన్ని మతపరంగా విభజించే శక్తులపై పోరాటం చేయాలన్నారు నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) అధినేత శరద్​ పవార్. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు.. బీజేపీ చేస్తున్న వ్యూహాలకు మన ప్రజలు కొందరు బలైపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సతారా జిల్లాలోని కరాడ్​లో పార్టీ శ్రేణులను, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన శరద్​ పవార్​.. ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎన్​సీపీని చీల్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే.. శరద్​ పవార్​ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సతరించుకున్నాయి.

"మహారాష్ట్రలో, దేశంలో ప్రజలను మతపరంగా విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాంతియుతంగా ఉన్న ప్రజల్లో భయాన్ని నింపే శక్తులపై మనం పోరాటం చేయాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది." అని శరద్ ​పవార్​ వ్యాఖ్యానించారు. కొన్ని వర్గాలు కులం, మతం పేరుతో సమాజం మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం గురు పూర్ణిమ సందర్భంగా తన గురువు, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ స్మారక చిహ్నానికి నివాళులు అర్పించారు శరద్​ పవార్. అనంతరం పార్టీ శ్రేణులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

అంతకుముందు.. సోమవారం ఉదయం పుణె నుంచి కరాడ్​ వెళుతున్న శరద్​ పవార్​కు.. భారీ సంఖ్యలో మద్దతు తెలిపారు అభిమానులు. రోడ్డుకు ఇరువైపుల నిలబడి అభివాదం చేస్తూ.. తమ మద్దతును తెలియజేశారు. కరాడ్​లోనూ వేల మంది అభిమానులు శరద్ పవార్​కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ సైతం పాల్గొన్నారు.

త్వరలో ముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​!
త్వరలోనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్థానాన్ని అజిత్​ పవార్​ భర్తీ చేస్తారని.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. సంవత్సరం క్రితం శివసేనను చీల్చి బయటకు వచ్చిన వారిలో 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని ఆయన జోస్యం చెప్పారు. శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ ఉమ్మడిగానే మహారాష్ట్రలో పోటీ చేస్తాయని రౌత్ పేర్కొన్నారు. "బీజేపీ శివసేన, ఎస్​సీపీ, కాంగ్రెస్​ను చీల్చుతోంది. వారికి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోజనకరంగా ఉండదు. ఎన్​సీపీ నేతలు అవినీతి పాల్పడ్డరాన్న ప్రధాని.. ఇప్పుడు వారినెందుకు రాజ్​భవన్​లో​ ప్రమాణ స్వీకారం చేయించారు?". అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

ఆ 8 మంది ఎన్​సీపీ ఎమ్మెల్యేలపై తగిన చర్యలు: మహారాష్ట్ర స్పీకర్​
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది ఎన్​సీపీ ఎమ్మెల్యేలపై.. తగిన చర్యలు తీసుకుంటానని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ రాహుల్ నర్వేకర్ సోమవారం వెల్లడించారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై.. ఎన్​సీపీ వేసిన అనర్హత పిటిషన్​ తనకు అందిందని ఆయన వెల్లడించారు. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చట్టపరంగా ముందుకు వెళతానని రాహుల్ వివరించారు.

Last Updated : Jul 3, 2023, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details