నెలకు రూ. 100 కోట్లు సంపాదించాలని పోలీసులకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ రాసిన లేఖ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఎన్సీపీ నేత దేశ్‌ముఖ్‌ను సమర్థిస్తూ ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మాట్లాడటం.. పవార్‌ను ఇరకాటంలో పెట్టాలని యత్నిస్తూ భాజపా ఎదురుదాడికి దిగడం వల్ల రాష్ట్రంలో పరిస్థితి వాడీవేడీగా మారింది.
ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించిన శరద్ పవార్.. పోలీసులకు వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని చెప్పిన సమయంలో దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. అప్పుడు కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.
"ఫిబ్రవరి మధ్యలో.. హోంమంత్రి కొందరు పోలీసులకు వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని మాజీ కమిషనర్ తన లేఖలో ప్రస్తావించారు. కానీ.. కరోనా వల్ల ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు అనిల్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. డిశ్చార్జి తర్వాత ఫిబ్రవరి 27 వరకు హోంక్వారంటైన్లో ఉన్నారు. కాబట్టి ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది."
-శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
అయితే, ఫిబ్రవరి 15న దేశ్‌ముఖ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని భాజపా పేర్కొంది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్నారని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. సెక్యూరిటీ గార్డులు, మీడియా సిబ్బందితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు.
దేశ్‌ముఖ్ వివరణ
ఈ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌పై వివరణ ఇచ్చారు అనిల్ దేశ్‌ముఖ్. ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన ఆయన.. డిశ్చార్జి తర్వాత ఆస్పత్రి ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడానని చెప్పారు. తనకు ఓపిక లేనందున కుర్చీలో కూర్చున్నానని స్పష్టం చేశారు.
"ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు నాగ్‌పుర్‌లోని అలెక్సిస్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాను. ఫిబ్రవరి 15న డిశ్చార్జి అయ్యాను. ఆస్పత్రి బయట ఉన్న కొందరు విలేకరులు.. నేను బయటకు వచ్చే సమయంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడే కొవిడ్ నుంచి కోలుకోవడం వల్ల నాకు నీరసంగా అనిపించింది. గేట్ వద్ద కుర్చీపై కుర్చొని పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి, ఫిబ్రవరి 27 వరకు హోం క్వారంటైన్లో ఉన్నాను. ఫిబ్రవరి 28న బయటకు వచ్చి సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాను."
-అనిల్ దేశ్‌ముఖ్, మహారాష్ట్ర హోంమంత్రి
నిర్ణయం సీఎందే: కాంగ్రెస్
దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి హెచ్‌కే పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా అంశంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక్కరే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేశారు పాటిల్.