Navratri Kanya Pujan 2023 Gift Ideas :ప్రస్తుతం దేశంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది దుర్గాదేవీ భక్తులు ఈ సమయంలో నవరాత్రులు (తొమ్మిది రోజులు) అమ్మవారి సేవలో ఉంటారు. ఇందులో భాగంగానే భవానీ(దుర్గామాత) దీక్ష తీసుకోవడం లేదా మాలధారణ చేయడం చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రుల సందర్భంగా నిర్వహించే 'కన్యా పూజ(Kanya Puja)' లేదా 'కంజక్ పూజన్(Kanjak Poojan)' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పూజను ప్రధానంగా అష్టమి, నవమి రోజుల్లో నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా బాలికలను అది కూడా 2 నుంచి 10 సంవత్సరాలలోపు ఉండే ఆడపిల్లలను మాత్రమే ఈ పూజా కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఈ సమయంలో వీరిని అమ్మవారి (దుర్గామాత) అవతారాలుగా భావిస్తారు. అందుకని కనీసం 9 మంది అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చి ప్రత్యేకంగా సేవించుకుంటారు. ఇలా పిలిచిన చిన్నారులకు ముందుగా నీళ్లు, లేదా పాలతో పాదాలు కడిగి ఇంట్లోకి తీసుకువెళ్తారు. అనంతరం వారి కోసం వండిన వివిధ ఆహార పదార్థాలను వడ్డిస్తారు. అది కూడా చిన్నపిల్లలకు నచ్చే ఆహారాలను మాత్రమే తయారు చేస్తారు. దీనినే 'భోగ్' అని కూడా అంటారు. అలాగే 'కన్యా పూజ'కు వచ్చిన బాలికలకు కొన్ని రకాల కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఇలాంటి కానుకలు ఇవ్వాలని చూస్తున్నారా? మరి ఏయే కానుకలు ఇస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.
స్టేషనరీ కిట్!
పిల్లలు అత్యంత ఇష్టంగా ఇష్టపడే వస్తువుల్లో స్టేషనరీ కిట్ ఒకటి. ఈ కిట్‌లో పెన్సిల్స్, రబ్బర్, షార్ప్‌నర్, స్కేల్, స్లేట్(పలక) ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు ఇవి కాస్త కలర్ఫుల్గా, డిఫరెంట్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చిన్నారులు కలర్ఫుల్గా, వైవిధ్యంగా ఉండే వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు. వీటన్నింటినీ ఫ్యాన్సీగా ఉండే ఓ చిన్నపాటి కలర్డ్ ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టి ఇవ్వండి. వీటికి అదనంగా నోట్ పుస్తకాలు, బొమ్మల పుస్తుకాలు కూడా ఇవ్వవచ్చు.
జ్యువెలరీ సెట్!
అమ్మాయిలు ముఖ్యంగా పదేళ్లలోపు బాలికలు ఇమిటేషన్ జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడతారు. వీరి కోసం మార్కెట్లో ప్రత్యేకంగా జువెలరీ సెట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని గిఫ్ట్స్‌గా ఇవ్వొచ్చు. ఒకవేళ అలాంటివి కాస్త ఖరీదు ఎక్కువగా అనిపిస్తే విడిగా కొని కూడా వాటిని ఇవ్వవచ్చు. ఇందులో జుంకాలు, బొట్టు బిల్లలు(స్టికర్స్), రంగు రంగుల గాజులు, లిప్‌స్టిక్, సెంట్ బాటిల్, కాటుక, గోరింటాకు కోన్, బ్రేస్లెట్, ముక్కెర లేదా ముక్కు పోగు, కాళ్ల పారాని, నెక్లెస్, దువ్వెన, హెయిర్ పిన్స్ లేదా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలా వీటన్నింటినీ ఒక పెట్టెలో లేదా ఫ్యాన్సీ బ్యాగ్‌లో పెట్టి ఇవ్వొచ్చు.
క్రియేటివ్ గిఫ్ట్స్!
పిల్లలు క్రియేటివ్‌గా కనిపించే వాటిపై కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకని మ్యూజికల్ ఫోన్స్, మ్యాజిక్ స్లేట్స్, అబాకస్ స్లేట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌కి సంబంధించిన వస్తువులైన డ్రాయింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్, క్రెయాన్స్, వాటర్ కలర్స్, రంగీలా కలర్స్, కలర్ పెన్స్ ఇలా పిల్లలు ఎంతో ఇష్టంతో వేసే బొమ్మలకు సంబంధించిన వస్తువులను కూడా ఓ కిట్ రూపంలో ఇవ్వొచ్చు.
కార్టూన్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్!
చిన్నారులు ముఖ్యంగా కార్టూన్ బొమ్మలు ఉన్న వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. 10 ఏళ్లలోపు పిల్లలు సాధారణంగా 5, 4, 3వ తరగతుల్లో ఉంటారు గనుక వారికి నచ్చేట్టుగా బార్బీ, సిండ్రెల్లా లాంటి క్యారెక్టర్స్ బొమ్మలు ఉన్న స్కూల్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను ఇవ్వవచ్చు. అయితే ఇవి పింక్ కలర్లో ఇస్తే అమ్మాయిలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.