Navjot singh sidhu in jail: మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో జైలు శిక్ష పడటంతో.. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన్ను ఇక్కడికి తరలించారు. జైల్లో తొలి రోజు సిద్ధూకు కాస్త కష్టంగానే గడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, దాదాపు 24 గంటలు కావస్తున్నా.. జైలు అధికారులు ఆయనకు అనువైన ఆహారాన్ని సమకూర్చలేదని సిద్ధూ తరఫు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ ఆరోపించారు. శుక్రవారం రాత్రి రోటీ, పప్పు వడ్డించగా.. గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా సిద్ధూ వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. అప్పటినుంచి ఆయనకు భోజనమే లేదన్నారు.
ఈ క్రమంలోనే సిద్ధూ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఆహారం అందించాలని సదరు న్యాయవాది శనివారం పాటియాలా కోర్టులో అప్పీల్ చేశారు. అయినా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 'ఉదయం నుంచి కోర్టులో కూర్చుని.. జైలు అధికారులు వస్తారని వేచి ఉన్నా. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు' అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సిద్ధూకు జైలులో ఖైదీ నంబరు 241383 కేటాయించారు. 10 నంబరు గదిలో ఉంచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు అదే సెల్‌లో మరో 8 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది.