క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మారుస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్దిసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్వాగతం పలికారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నెటిజన్లు మరో ఆలోచనను పంచుకున్నారు. అదేంటంటే.. ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలన్నారు.
టీమ్‌ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. " ఈ మార్పుని కచ్చితంగా స్వాగతిస్తున్నాం. క్రీడాకారుల పేర్లమీద పురస్కారాలు అందిస్తే వారికి గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో స్టేడియం పేర్లకు క్రీడాకారుల పేర్లే పెడతారని భావిస్తున్నా" అన్నారు.
గుజరాత్ ప్రతిపక్షనేత శంకర్ సిన్హ్ వాఘేలా సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు." ఈ మార్పు చేసిన మీరే.. నరేంద్రమోదీ స్టేడియంకి తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా" అంటూ ట్వీట్ చేశారు.
ఈ చర్చ కేవలం ప్రముఖులతో ఆగిపోలేదు. రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మార్చి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో నరేంద్రమోదీ స్టేడియం, జైట్లీ స్టేడియం పేర్ల వాటిస్థానంలో క్రీడాకారుల పేర్లు పెట్టాలి. రాజకీయ నేతల పేర్లు తీసేయాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేశారు
అదే స్ఫూర్తితో.. ఈ స్టేడియం పేర్లూ మార్చండి..