మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను(Uddhav Thackeray) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణె(Narayan Rane).. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై బాంబే హైకోర్టు(Bombay High Court) నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో రాణె సహా ఆయన తరఫు న్యాయవాదుల బృందం.. హైకోర్టుకు చేరుకుంది. నోటీసులు ఇవ్వకుండా తనను పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నారాయణ్ రాణె తన పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు.. రాణెను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఆయనకు తాజాగా నాసిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 2న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
రాణె ఏమన్నారంటే...
దేశానికి ఏ సంవత్సరం స్వాతంత్ర్యం వచ్చిందో అడిగి తెలుసుకున్న సీఎంను చెంప చెల్లుమనిపించేవాడినంటూ కేంద్రమంత్రి రాణె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ శివసేన శ్రేణులు నాసిక్ సహా పలు ప్రాంతాల్లో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి రాణెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు.. ఆయనను అరెస్టుచేశారు.
రూ.15 వేల పూచీకత్తుతో..
అయితే.. అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పగా పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్ పోలీసులకు అప్పగించారు. రాత్రి మహాద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలుమంజూరైంది. అయితే.. ఆగస్టు 31, సెప్టెంబర్ 13 తేదీల్లో ఈ కేసు విచారణలో భాగంగా రత్నగిరి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని రాణెను ఆదేశించింది న్యాయస్థానం. భవిష్యత్తులో ఇలాంటి తరహా నేరాలు పాల్పడకూడదని చెప్పింది. రూ.15,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.