తెలంగాణ

telangana

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసవత్తర పోరు - నీలగిరిలో నిలిచేదెవరు?

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 7:39 AM IST

Nalgonda Politics Telangana Assembly Elections 2023 : తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పురిటిగడ్డ. నీలగిరి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల యుద్ధం కొనసాగుతోంది. గెలుపుతో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండుకు 9 స్ధానాల్లో విజయబావుటా ఎగురవేసిన బీఆర్ఎస్.. ఈసారి అదే జోరు కొనసాగించేందుకు కసరత్తులు చేస్తోంది. గులాబీ పార్టీ హవాకు గండికొట్టి.. సాధ్యమైనన్ని ఎక్కువ స్ధానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. కొన్ని స్ధానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చి.. ప్రధాన పార్టీ అభ్యర్ధులను ఖంగుతినిపించాలని బీజేపీ భావిస్తోంది.

Telangana assembly Elections 2023
Nalgonda Politics Telangana assembly Elections 2023

Political Parties Strategy in Telangana

Nalgonda Politics Telangana Assembly Elections 2023 : నల్గొండ జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు దూకుడుతో దూసుకెళుతున్నాయి. నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. గులాబీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టేశారు. మరోసారి పాగా వేయాలనే లక్ష్యంతో అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. పథకాల లబ్ధిదారుల కేటాయింపులో వివక్ష పాటించారనే ఆరోపణలుండటం ప్రతికూలం. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి నల్గొండలో వరుసగా నాలుగుసార్లు గెలిచారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రసవత్తర పోరు :గత ఎన్నికల్లో భూపాల్‌ రెడ్డి చేతిలో ఖంగుతిన్నా.. ఈసారి గెలుపు ఖాయమే ధీమాతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌ గడప గడపకు వెళుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.మునుగోడు పోరు మరోసారిఆసక్తిని రేపుతోంది. ఈసారి త్రిముఖపోరు ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఉపఎన్నికల తర్వాత చేపట్టిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.

2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేసి అనివార్యంగా వచ్చిన మునుగోడు ఉపపోరులో కమలం పార్టీ తరఫున పోటీచేసి కూసుకుంట్ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. హస్తం టికెట్‌ ఆశించిన చలమల కృష్ణారెడ్డి చివరి నిమిషంలో బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. సీపీఎం అభ్యర్థిగా నర్సిరెడ్డి బరిలో ఉన్న ప్రభావం నామమాత్రమే.

సూర్యాపేట రాజకీయం హోరాహోరీగా మారింది. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన మంత్రి జగదీశ్‌రెడ్డి రెండు ఎన్నికల్లోనూ బొటాబొటి మెజార్టీతో గట్టెక్కగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి కొంత ప్రతికూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన వట్టే జానయ్య బీఎస్పీ అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్‌ ఖరారుతో హస్తం పార్టీ విభేదాలు భగ్గుమన్నాయి. టికెట్‌ ఆశించి భంగపడ్డ పటేల్‌ రమేష్‌రెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్‌ వేశారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Telangana Assembly Elections 2023 :బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. పటేల్‌ రమేశ్‌రెడ్డి, వట్టే జానయ్య, కమలం పార్టీ చీల్చే ఓట్లు గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. కోదాడలో ద్విముఖ పోరు నెలకొంది. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి, జనసేన తరఫున సతీశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీసీ నినాదంతో ప్రచారంలోకి వెళుతున్నా మల్లయ్య యాదవ్‌కి సోంత పార్టీ నేతలే సహకరించని పరిస్థితి నెలకొంది. కీలక నేతలు కాంగ్రెస్‌ పంచన చేరడం కొంత ప్రతికూలాంశం. కోదాడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హుజూర్‌నగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధికార పార్టీ, కాంగ్రెస్‌ నుంచి స్టార్ క్యాంపెయినర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ తరఫున శ్రీలతరెడ్డి ఎన్నికల్లో నిలపడ్డారు. పార్టీ సంక్షేమ పథకాలు, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారంలో సైదిరెడ్డి ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. ఉత్తమ్ స్కెచ్ వేస్తే.. ప్రత్యర్థి ఎంతటి వారైనా చిత్తవ్వాల్సిందే. నియోజకవర్గంలో విస్తతంగా తిరగకపోవడం, ఓట్లరని కలవలేకపోవటం ప్రతికూలాంశం.

Political Parties Strategy in Telangana :తుంగతుర్తిలో అధికార ప్రభుత్వ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మందుల సామేలు, బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య బరిలో ఉన్నారు. రెండుసార్లు గెలిచిన కిషోర్‌ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. అభివృద్ధి చూసి ఓటర్లు మరోసారి ఆశీర్వదిస్తారని ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు ఉద్యమకారుడు. బీఆర్ఎస్​లో సముచిత స్థానం లేదనే కారణంతో కాంగ్రెస్‌లో చేరారు. అద్దంకి దయాకర్ కలిసి పనిచేస్తామని చెప్పడం, గులాబీ పార్టీ వ్యతిరేకవర్గం కాంగ్రెస్‌లోకి రావడం కలిసొచ్చే అంశాలు.

ఆలేరులో బీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత, కాంగ్రెస్ తరఫున బీర్ల ఐలయ్య, బీజేపీ అభ్యర్థిగా పడాల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. యాదాద్రి అభివృద్ధిలో నిర్వాసితులు, ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు అండగా లేకపోవడం కొంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య.. బీర్ల ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టడం లాభిస్తుందని ఆశిస్తున్నారు. పార్టీలో వర్గ విభేదాలు తలనొప్పిగా మారాయి. భువనగిరి అధికార పార్టీ అభ్యర్థిగా పైళ్ళ శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కమలం పార్టీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు.

Election Campain in Telangana :పార్టీ క్యాడర్, ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరోసారి గెలిపిస్తాయని పైళ్ల ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవల గులాబీ గూటికి చేరి రెండు నెలల వ్యవధిలోనే సొంత గూటికి చేరారు. అధికారంలో లేకపోయిన ప్రజల్లో ఉంటూ ప్రజల మద్దతు కూడగట్టడం లాభించే అంశం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం ఎంతమేరకు సహకరిస్తోందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మిర్యాలగూడలో బీఆర్ఎస్ నుంచి నల్లమోతు భాస్కరరావు, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా బత్తుల లక్ష్మారెడ్డి, సాధినేని శ్రీనివాస్, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలో ఉన్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన భాస్కరరావుకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలే మూడోసారి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి పలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరులు వీరే!చేపట్టారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుందని బత్తుల ఆశిస్తున్నారు. జూలకంటి రంగారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. నాగార్జునసాగర్‌లో గులాబీ పార్టీ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి కుమారుడు జైవీర్‌రెడ్డి, బీజేపీ తరఫున మహిళా అభ్యర్థి కంకణాల నివేదిత పోటీలో ఉన్నారు.

Nalgonda MLA Candidates List :మూడేళ్లలో చేపట్టిన ప్రగతి పనులే మళ్లీ గెలిపిస్తాయనే భరోసాతో భగత్‌ ఉన్నారు. పార్టీలో వర్గ విభేదాలు కొంత వ్యతిరేకత చూపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ నుంచే పోటీ చేస్తున్న సీనియర్‌ నేత జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌ను నిలబెట్టారు. సాగర్‌ను మళ్లీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. నోముల భగత్, జైవీర్‌ ఇద్దరు యువ నాయకుల మధ్య పోటీ రక్తికట్టనుంది.

నకిరేకల్‌లో బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులుగా వేముల వీరేశం, మొగులయ్య బరిలో ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపారనే విమర్శలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లింగయ్యపై ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం మద్దతు కలిసొచ్చే అంశాలు. దేవరకొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా బాలునాయక్, లాలునాయక్‌ ఎన్నికల్లో నిలబడ్డారు.

నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేసిన రవీంద్ర నాయక్‌ కార్యకర్తలు, ముఖ్య నేతల నుంచి సహకారం లేకపోవడం వైరి అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. జానారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్న బాలు నాయక్‌ సైతం విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన లాలూ నాయక్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధిక్యం కోసం ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి.


పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్

ఉచిత కరెంట్​పై జానారెడ్డి మాట తప్పారు - హాలియా సభలో కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details