'పేరులో ఏముంది?' అని షేక్స్పియర్ అంటుంటారు. కానీ, పేరే అన్నింటికీ మూలం. మనుషులతో పాటు రెస్టారెంట్లకూ ఈ విషయం వర్తిస్తుంది. కొత్తగా రెస్టారెంట్ ప్రారంభించాలంటే టేస్టీ వంటకాలతో పాటు పేరు కూడా ముఖ్యమే. బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ సైతం ఇలాగే వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్‌కు 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరు పెట్టారు. అంటే 'నా రెండో భార్య అని అర్థం'. అంతే కాదు, పేరుకు తగ్గట్టు.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు.
ఇలాంటి పేరు ఎందుకంటే?
పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో ఈ హోటల్ నెలకొల్పాడు రంజిత్. రోడ్డుపై వెళ్తున్నవారు పేరు చూసి హోటల్‌కు వస్తున్నారు. ప్రస్తుతం హోటల్లో టీ, బర్గర్లు, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నట్లు రంజిత్ తెలిపాడు. వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌లు సైతం విక్రయిస్తానని చెబుతున్నాడు. రెస్టారెంట్‌కు 'మై సెకండ్ వైఫ్' అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు రంజిత్. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని అంటున్నాడు. 'ఇంటి వద్ద నాకు భార్య ఉంది. ఇక్కడ మాత్రం రెస్టారెంట్ నా భార్య వంటిది. ఇవి రెండంటే నాకు ఇష్టం' అని చెబుతున్నాడు. హోటల్‌కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని రంజిత్ చెబుతున్నారు.