Couple Murder News: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నగరానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలను వారి ఇంట్లోనే దుండగులు హత్య చేశారు. రెండు రోజులుగా వారి ఇంటి నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. పోలీసుల వచ్చి పరిశీలించగా.. విషయం బయటపడింది.
ఇదీ జరిగింది.. ఔరంగాబాద్‌లోని పుండ్లిక్ నగర్లో శ్యామ్‌సుందర్ కళంత్రి అనే వ్యాపారవేత్త నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా అతడి ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిశీలించగా శ్యామ్‌సుందర్, అతడి భార్య కిరణ్ కళంత్రి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే శ్యామ్సుందర్కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం అతడు తన మూడో భార్య కిరణ్‌తో ఉంటున్నాడు. వీరిద్దరికి జన్మించిన కుమార్తె వైష్ణవి ఉన్నత చదువుల కోసం వేరే ఊర్లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా శ్యామ్‌సుందర్ మొదటి భార్య కుమారుడు ఆకాశ్ కనిపించట్లేదు. దీంతో అతడిపైనే తనకు అనుమానం ఉందని శ్యామ్ కుమార్తె వైష్ణవి పోలీసులకు తెలిపింది. ఇక పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.
చెరువులో విగతజీవులుగా.. హరియాణాలోని రేవారిలో విషాదం జరిగింది. రెండు రోజులుగా అదృశ్యమయిన తల్లీపిల్లలు.. గ్రామంలో ఉన్న చెరువులో విగతజీవులుగా కనిపించారు. స్థానికుల ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాల్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోస్లీ గ్రామంలో నివాసం ఉంటున్న సీతాదేవి (35), కుమారుడు లక్ష్య (9), కుమార్తె మనీషా (10) శనివారం అదృశ్యమయ్యారు. ముగ్గురి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం తెల్లవారుజామున కోస్లీ మఠం వెనుక ఉన్న చెరువులో మహిళ మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండడాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే మహిళ, ఆమె ఇద్దరు పిల్లల మృతికి గల కారణాలేమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.