ముంబయి డ్రగ్స్ కేసులో(mumbai drug case news) తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడే(sameer wankhede news). తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే.. ఈ అంశంపై సీబీఐ లేదా ఏదైనా కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
సమీర్ వాంఖడేపై(sameer wankhede news) నాలుగు భిన్న ఫిర్యాదులు అందినట్లు కోర్టుకు తెలిపారు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేపట్టారని, అయితే ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే 72 గంటల ముందే నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
అరెస్ట్ చేయటానికి 3 రోజుల ముందే నోటీసులు ఇస్తామని మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపిన నేపథ్యంలో.. వాంఖడే పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు.
పార్టీ నిర్వాహకులపై చర్యలేవి: మహా మంత్రి
క్రూయిజ్ డ్రగ్స్ కేసు(mumbai drug case news) ఫేక్ అని తరచుగా ఆరోపణలు చేస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరోమారు ఎన్సీబీ తీరును ప్రశ్నించారు. పార్టీ నిర్వహకులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నిర్వహకుడు ఎన్సీబీ జోనల్ అధికారి సమీర్ వాంఖడేకు స్నేహితుడని పేర్కొన్నారు. 'ఎలాంటి అనుమతి లేకుండా అంత పెద్ద పార్టీ ఎలా నిర్వహించగలిగారు? ఫ్యాషన్ టీవీ ఇండియా హెడ్, సమీర్ వాంఖడే స్నేహితుడైన కాశిఫ్ ఖాన్‌పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఈ ప్రశ్నలకు వాంఖడే నుంచి సమాధానం కోరుతున్నా' అని పేర్కొన్నారు.
'వాంఖడే తండ్రి పేరు దావూద్'
సమీర్ వాంఖడే(sameer wankhede news) మతంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మొదటి భార్య తండ్రి డాక్టర్ జహీద్ ఖురేషీ. వాంఖడే కుటుంబం ఇస్లాంను పాటిస్తుందని, ఆయన తండ్రి పేరు దావూద్ అని పేర్కొన్నారు. తన కూతురితో వివాహం తర్వాత ఇస్లాం మతాన్ని అనుసరించేవారని, తరచుగా మసీదులకు వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. ఇటీవల తలెత్తిన వివాదం తర్వాతే వాంఖడే హిందువు అనే విషయం తనకు తెలిసినట్లు చెప్పారు.