అది 2008 నవంబరు 26.. (2008 Mumbai attacks)
సమయం: రాత్రి 8 గంటలు..
ప్రదేశం: ముంబయిలోని కొలాబా సముద్రతీరం..
10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో అక్కడకు చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.
సమయం: రాత్రి 9.30 గంటలు
ప్రదేశం: ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్
రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి (26/11 attack year) ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి వద్ద ఉన్న ఏకే-47 తుపాకులు నిప్పులు కక్కాయి. ప్రజలపై తూటాల వర్షం కురిసింది. కన్పించిన వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని దాడికి ప్రజలు అల్లాడిపోయారు. భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అనేకమంది ప్రజలు క్షతగాత్రులయ్యారు.
అమరులకు నివాళి..
ముంబయి పేలుళ్లు (26 11 Mumbau attacks) జరిగి 13 ఏళ్లను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఉగ్రవాదులను ఎదుర్కొన్న భద్రతా సిబ్బందిని ప్రశంసించారు.
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం మంత్రి దిలీప్ పాటిల్.. దక్షిణ ముంబయి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
నివాళులు అర్పిస్తున్న మహారాష్ట్ర గవర్నర్ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నివాళులు శస్త్రచికిత్స అనంతరం.. ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా అమరులను స్మరించుకున్నారు.
కసబ్ చిక్కాడు..
దేశ వాణిజ్య రాజధానిలో ముంబయిలో (Attack of 26 11) బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా 13 ఏళ్లు. లష్కరే తోయిబా ఉగ్రమూకకు చెందిన 10 మంది ముంబయిలో 12 చోట్ల నరమేధం సృష్టించారు. పోలీసులు స్పందించలోపే ఘోరం జరిగిపోయింది. అయితే, పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు. ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కాంతే తదితరులు అమరులయ్యారు.
నేటికీ విషాదంలోనే..
ముష్కరుల దాడితో ముంబయి వణికిపోయింది. ఘటనా స్థలాల్లో రక్తం ఏరులైపారింది. శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడి భయంగొల్పింది. హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఆ భయానక రాత్రిని తల్చుకుంటే ముంబయి వాసులకు ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుతూనే ఉంటుంది. తమ వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు నేటికీ కన్నీరుమున్నీరవుతున్నాయి.
పాక్ ఏకాకి..
ముంబయి ఉగ్రదాడి కారణంగా.. భారత్- పాకిస్థాన్ సంబంధాలు (India pak news) క్షీణించాయి. పేలుళ్ల సూత్రధారులను పాక్ పట్టుకొని శిక్షించాలని భారత్ డిమాండ్ చేస్తుండగా.. దాయాది దేశం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. మరోవైపు.. కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి భారత్‌ను (India pak relations) నిందిస్తుంది.
ఇవీ చూడండి: 'ముంబయి ఉగ్రదాడికి లఖ్వీని బాధ్యుడిగా ప్రకటించాలి'
9/11 ఉగ్రదాడి నిందితుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు