దేశ విభజన విషయంలో పట్టుబట్టి సఫలమైన మహమ్మద్ అలీ జిన్నా(Muhammad Ali Jinnah).. తన ఇల్లు(Jinnah House) అమ్మకం విషయంలో మాత్రం విఫలమయ్యారు. ముంబయిలో అరేబియా సముద్రానికి అభిముఖంగా.. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మలబార్ హిల్ సౌత్‌కోర్టు బంగ్లాకు రూ.17 లక్షల బేరం వస్తే.. 20 లక్షలు కావాలంటూ పట్టుబట్టారు జిన్నా! మూడు లక్షల కోసం చూసుకున్న జిన్నా కోరిక నేటికీ తీరలేదు. మంచి లాయర్‌గా పేరుగాంచిన జిన్నా.. 1937-39 మధ్య ఈ బంగ్లాను కట్టించుకున్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2లక్షలైంది. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలంగా నిర్మించిన ఈ ఇంట్లోకి 1939లో మారారు జిన్నా! ఆ మరుసటి ఏడాదే 1940లో పాకిస్థాన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో.. జిన్నా అయిష్టంగానే అయినా బంగ్లాను అమ్మకానికి పెట్టారు.
తగ్గేది లేదంటూ మొండికేశారు..
తొలుత ఈ బంగ్లాను చూసిన వారిలో హైదరాబాద్ రాజు నిజాం ఒకరు. రూ.8.50లక్షలకిస్తే తీసుకుంటానంటూ జిన్నాతో బేరమాడారు. ఆ అంకె చూడగానే ఖిన్నుడైన జిన్నా ససేమిరా అన్నారు. ఒకవంక విభజన ఖాయమై పోతున్నా బంగ్లా మాత్రం అమ్ముడుపోకపోవటం జిన్నాకు చింతగా మారింది. 1947 మేలో.. ఎఎం తరైని అసోసియేట్స్ అనే కంపెనీ రూ.17 లక్షలకు తీసుకోవటానికి ముందుకొచ్చింది. కానీ జిన్నా.. రూ.20 లక్షలకు ఒక్క పైసా తగ్గేది లేదంటూ మొండికేశారు. దీంతో ఆ బేరం పోయింది. చివరకు... తమ రాయబార కార్యాలయం కోసం కొనుగోలు చేయాలంటూ ఇరాన్‌నూ కోరారు. అదీ పనిచేయలేదు. ఇంతలో విభజన ముహూర్తం రానే వచ్చింది. తానెంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని జిన్నా అలాగే వదిలేసి వెళ్ళక తప్పలేదు.