తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష - ధోనీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారికి శిక్ష

MS Dhoni Defamation Case : క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణలో భాగంగా కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ 15 రోజులు జైలు శిక్షను విధించింది.

MS Dhoni Defamation Case
MS Dhoni Defamation Case

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 1:57 PM IST

MS Dhoni Defamation Case : భారత మాజీ కెప్టెన్​, క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ వేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఐపీఎస్​ అధికారికి 15 రోజుల జైలు శిక్షను విధించింది మద్రాస్ హైకోర్టు. సంపత్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్​ ఎస్​ఎస్​ సుందర్​, జస్టిస్​ సుందర్​ మోహన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ శిక్షను న్యాయస్థానంలో సవాల్​ చేసుకునేందుకు వీలుగా 30 రోజుల వరకు అమలును నిలుపుదల చేస్తూ అదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు.

ఇదీ జరిగింది
2013లో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​ జీ టీవీ ఛానల్​లో మాట్లాడుతూ ఐపీఎల్​ ఫిక్సింగ్​కు, క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ సంబంధిత టీవీ ఛానల్​తో పాటు అధికారి సంపత్​పై 2014లో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ధోనీ పిటిషన్​పై స్పందించిన హైకోర్టు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ జీ టీవీ యాజమాన్యానికి, సంపత్​కు నోటీసులు జారీ చేసింది. ధోనీ నోటీసులపై జీ మీడియా ఇచ్చిన వివరణ కోర్టు కొట్టివేసింది. ధోనీ లాంటి అంతర్జాతీయ క్రికెటర్​పై వార్తలు ప్రచురించే ముందు జాగ్రత్తగా ఉండాలని విచారణ సందర్భంగా కోర్టు సూచించింది. మరోవైపు ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్ ఇచ్చిన వివరణపై ధోనీ సంతృప్తి చెందలేదు. ఆయన ఇచ్చిన వివరణలో సుప్రీం కోర్టు, హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోర్టు ధిక్కరణ కింద వెంటనే సంపత్​పై చర్యలు తీసుకోవాలని మద్రాస్​ హైకోర్టును ధోనీ కోరారు. ఈ పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం సంపత్​కు 15 రోజులు జైలు శిక్షను విధించింది. అయితే శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.

ధోనీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం - జెర్సీ నెం.7కి రిటైర్మెంట్

ఫ్రెండ్ బర్త్​డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్​ సస్పెండ్!

ABOUT THE AUTHOR

...view details