సొంత గ్రామంలో మంచి నీటి సమస్యపై అధికారులను ముఖ్యమంత్రి మందలించడం.. విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. సీఎం ఊర్లోనే ఇలా ఉంటే.. ఇతర ప్రాంతాల సంగతేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ శిహోర్ జిల్లాలో పర్యటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అదే జిల్లాలోని ఆయన సొంత గ్రామం జైట్‌ను శనివారం సందర్శించారు. అక్కడ జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీఎంను కలిశారు. గ్రామంలోని నీటి కష్టాలను సీఎం ముందు చెప్పుకున్నారు. గ్రామస్థుల ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం అధికారులపై మండిపడ్డారు.
"జల్ నిఘమ్ ఏం చేస్తోంది? నా సొంత గ్రామానికే నీటిని సరఫరా చేయడం లేదు. ప్రతి దరఖాస్తును పరిశీలించి, నీళ్ల కుళాయిని ఇవ్వడం నా బాధ్యతా? 15రోజుల తర్వాత పరిస్థితులను మళ్లీ సమీక్షిస్తాను. ఒక్క ఫిర్యాదు అందినా.. ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండరు. ఇది సరైన పద్ధతి కాదు. కుళాయిలో నుంచి నీళ్లు వస్తున్నాయా? లేదా? అని సీఎం చూడాలా? చిన్న చిన్న విషయాలకు కూడా ప్రజలు సీఎం వద్దకు రావాల్సిందేనా? సర్వే నిర్వహించి, నీటి సరఫరాపై 15రోజుల్లో నివేదిక అందించాలి," అని శివరాజ్‌సింగ్ మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. 17ఏళ్ల పాటు సీఎం బాధ్యతలు చేపట్టిన వ్యక్తి సొంత గ్రామంలోనే నీటి సంక్షోభం ఉంటే.. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి? అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ఇదీ చూడండి:-అప్పటివరకు ఈడీ కస్టడీలోనే మాజీ హోంమంత్రి