Mother In Law Written Exam With Daughter In Law :అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్షకు హాజరైన ఘటన బిహార్లోని నలందాలో జరిగింది. ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత పథకం 'అక్షర్ అంచల్ యోజన' కింద పెట్టిన పరీక్షకు ఇద్దరు హాజరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వ్యక్తులు ఒకేసారి పరీక్ష రాసి ఆశ్చర్య పరిచారు. నలందా జిల్లాలోని 105 సెంటర్లలో మహిళలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించారు. ఇందులో 60 మంది మహిళలు కొత్తగా అక్షరాస్యులయ్యారు.
ఇదీ జరిగింది..
రాణాబగిహాలోని కోసుక్ గ్రామానికి చెందిన పంబీ దేవి నిరక్షరాస్యురాలు. ఆమె కోడలు ఇంద్రాణి దేవి సైతం చదువుకోలేదు. ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోని మనవరాళ్లను చూసిన పంబీ దేవికి.. చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో గ్రామంలోని అక్షర్ అంచల్ యోజన అధికారి మున్నా మాంఝీని కలసింది. మరోవైపు కోడలు ఇంద్రాణి సైతం నిరక్షరాస్యురాలు కావడం వల్ల ఆమె సైతం అత్తతో కలిసి చదువుకునేందుకు వెళ్లేది. ఈ క్రమంలోనే చదవడం నేర్చుకున్న అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్ష రాశారు.
"నా మనవరాళ్లను చూసినప్పుడు నాకు చదవాలని, రాయాలనే కోరిక పుట్టింది. వెంటనే తరగతులుకు హాజరై చదవడం ప్రారంభించాను. ఇప్పుడు నా పేరు, నా భర్త పేరు రాయడం నేర్చుకున్నాను. నా మనవరాళ్లను కూడా చదివిస్తుంటాను. 55 ఏళ్ల తర్వాత పెన్ పట్టుకోవడం ఆనందంగా ఉంది."
--పంబీ దేవి, అత్త