Mother And Daughter Die Due To Electric Shock :దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకొంది ఆ కుటుంబం. అయితే, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పండగ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా పుట్‌పాత్‌పై కరెంట్ తీగ రూపంలో ఉన్న మృత్యువు.. వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు మృతిచెందారు. ఈ విషాద ఘటన బెంగళూరులో ఆదివారం ఉదయం జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
సౌందర్య(23), సంతోశ్ అనే దంపతులు బెంగళూరులోని ఏకే గోపాలన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి ఓ తొమ్మిది నెలల చిన్నారి ఉంది. దీపావళి పండగను చేసుకోవడానికి భార్య, పాపతో కలిసి చెన్నైకి వెళ్లారు సంతోశ్. పండగ తర్వాత ఆదివారం ఉదయం తిరిగి బెంగళూరుకు చేరుకున్న సంతోశ్ కుటుంబం.. ఇంటికి బయలుదేరింది. ఉదయం ఆరు గంటల సమయంలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని కడుగోడి ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్నారు.
అయితే, ఇంటికి వెళ్తున్న క్రమంలో ఫుట్‌పాత్‌పై అప్పటికే విద్యుత్ తీగ తెగిపడి ఉంది. ఈ విద్యుత్ తీగను గమనించని సౌందర్య.. వైర్‌పై కాలువేసింది. దీంతో కరెంట్ షాక్ తగిలి.. సౌందర్యతో పాటు 9నెలల చిన్నారి చనిపోయారు. ఆమె భర్త సంతోశ్.. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వారిని రక్షించే క్రమంలో మృతురాలి భర్త సంతోశ్ సైతం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.