వచ్చేనెల చివరి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి! కరోనా నిబంధనలకు అనుగుణంగా నెల రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సెషన్లో దాదాపు 20 సార్లు సమావేశాలు జరిగే అవకాశం ఉండగా.. క్రిస్మస్కు ముందే ముగుస్తాయని పేర్కొన్నాయి.
ఈ సెషన్ నవంబరు 29న ప్రారంభమై డిసెంబరు 23 నాటికి ముగుస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కరోనా కారణంగా గతేడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగలేదు. బడ్జెట్ సహా వర్షాకాల సమావేశాలను కుదించి.. నిర్వహించారు.
ఈ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలు ఏకకాలంలో సమావేశంగా కానుండగా.. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. సభ్యులు హాజరుకానున్నారు. తొలుత కొన్ని రోజులు రెండు సభలు వేర్వేరుగా భేటీ కానున్నాయి. సభల్లో పాల్గొన్నవారికి కొవిడ్ టెస్టులు నిర్వహించడం సహా మాస్క్ తప్పనిసరి చేయనున్నారు.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సెషన్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలను 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో ఈ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.
ఇదీ చూడండి:'ఆపరేషన్ సర్ప్‌వినాశ్'ను తలపించేలా పూంచ్ ఎన్‌కౌంటర్!