దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మరణాల సంఖ్యను తక్కువగా నమోదు చేశారన్న ఆరోపణలను కొట్టిపారేసింది. అదనపు మరణాలన్నింటినీ కొవిడ్ మరణాలుగా నివేదికలు పరిగణిస్తున్నాయని, ఇది సరైంది కాదని వ్యాఖ్యానించింది.
మరణాల నమోదు కోసం దేశంలో ఉన్న బలమైన వ్యవస్థ కారణంగా.. కరోనా మరణాలు లెక్కలోకి రాకపోవడం చాలా అరుదు అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. కరోనా కేసులు దృష్టికి రాకపోయినా.. మరణాలు మాత్రం నమోదు కాకుండా ఉండే అవకాశం తక్కువ అని స్పష్టం చేసింది. కరోనా వివరాలను జిల్లా స్థాయిలో నమోదు చేసి.. పైస్థాయికి అందజేస్తారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అందిస్తాయని వివరించింది.
"వైరస్‌తో చనిపోయే అవకాశం దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉంటుందనే విషయం ఆధారంగా మరణాల గణన చేపట్టారు. ప్రత్యక్ష, పరోక్ష కారకాలను విస్మరించారు. జనాభాలోని వివిధ వర్గాలను, వారి జీనోమ్ ఆకృతులను పరిగణనలోకి తీసుకోలేదు. యాంటీబాడీలు త్వరగా నాశనమవుతాయని, తద్వారా మరణాల రేటు పెరుగుతుందని ఈ అధ్యయనం భావించడం కూడా ఆందోళనకరం. అధికంగా నమోదైన మరణాలన్నింటినీ కరోనా మరణాలని ఈ అధ్యయనం పరిగణిస్తోంది. ఇది పూర్తిగా తప్పుదోవపట్టించే విధంగా ఉంది."
-కేంద్ర ఆరోగ్య శాఖ