తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టాన్‌ స్వామి మృతిపై వెల్లువెత్తుతున్న నిరసనలు!

సామాజిక ఉద్యమకారుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామి మృతిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాజానికి చెందిన హక్కుల సంఘాల నేతలు పేర్కొన్నారు. అయితే.. అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్టాన్‌ స్వామి మృతిపై విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) తొలిసారిగా స్పందించింది. విచారణలో ఉన్న ఖైదీ మృతికి సంబంధించి వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది.

By

Published : Jul 7, 2021, 5:29 AM IST

Updated : Jul 7, 2021, 11:48 AM IST

stan swamy
స్టాన్‌ స్వామి

సామాజిక ఉద్యమకారుడు, గిరిజన హక్కుల నేత ఫాదర్‌ స్టాన్‌ స్వామి మృతిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమను తీవ్ర కలతకు, దుఃఖానికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాజానికి చెందిన హక్కుల సంఘాల నేతలు పేర్కొన్నారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణానికి బాధ్యులెవరో తేల్చాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి దేశంలోని10 ప్రతిపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.

స్వదేశంలో, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడం వల్ల స్టాన్‌ స్వామి మృతిపై విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) తొలిసారిగా స్పందించింది. విచారణలో ఉన్న ఖైదీ మృతికి సంబంధించి వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనే అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపింది. నిందితుడిపై వచ్చిన అభియోగాల తీవ్రత, నేర స్వభావానికి అనుగుణంగానే న్యాయస్థానాలు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాయని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకొందని సమర్థించారు. హక్కుల ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు. స్టాన్‌ స్వామి అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరేందుకు న్యాయస్థానం అనుమతించిందని, కోర్టు పర్యవేక్షణలోనే వైద్యం అందించే ప్రయత్నం జరిగిందన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు భారత్‌ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

స్టాన్‌ స్వామి మృతిపై స్పష్టత కావాలి

హక్కుల ఉద్యమ నేత ఏ పరిస్థితుల్లో, ఎలా మరణించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ దుజరిక్‌ వ్యాఖ్యానించారు. స్టాన్‌ స్వామి మరణం తమ మనసులను కలచివేసిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ మిచెలె బాచెలె తెలిపారు. ప్రాథమిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఉద్యమించే నేతల్ని, శాంతియుతంగా సమావేశమయ్యే వారిని నిర్బంధించరాదని భారత ప్రభుత్వానికి మరోసారి సూచించినట్లు యూఎన్‌ మానవహక్కుల హైకమిషన్‌ అధికార ప్రతినిధి లిజ్‌ థ్రోసెల్‌ తెలిపారు. ఐరోపా సమాజంలో మానవ హక్కుల విభాగ ప్రత్యేక రిపోర్టర్‌ ఎమోన్‌ గిల్మోర్‌ కూడా స్టాన్‌ స్వామి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ముంబయిలో అంత్యక్రియలు

గుండెపోటుతో సోమవారం మృతిచెందిన రోమన్‌ క్యాథలిక్‌ మతాచార్యుడైన ఫాదర్‌ స్టాన్‌ స్వామి భౌతిక కాయానికి మంగళవారం ముంబయిలో అంత్యక్రియలను నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో బంధువులు, చర్చి ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు కొద్ది మంది హాజరయ్యారు.

ఇదీ చూడండి:డీలిమిటేషన్ కమిషన్​తో భేటికి పార్టీలన్నీ సుముఖత!

ఇదీ చూడండి:నేడే మంత్రివర్గ విస్తరణ- పూర్తైన కసరత్తు!

Last Updated : Jul 7, 2021, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details