భారత్‌లో కొవిషీల్డ్ టీకా వేయించుకున్నవారిలో రక్తస్రావం, రక్తం గడ్డకట్టడానికి సంబంధించి (థ్రాంబోఎంబోలిక్) 26 కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో ఇప్పటికే ఈ తరహా కేసులు బయటపడుతున్న వేళ.. వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిణామాల(ఏఈఎఫ్ఐ)పై ప్రభుత్వ ప్యానెల్ చేసిన దర్యాప్తులో ఈ మేరకు తేలింది.
దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైననాటి నుంచి 23 వేలకు పైగా ప్రతికూల పరిణామాలు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వాటిలో 700 కేసుల్లో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. విషమంగా ఉన్న 498 కేసులపై చేసిన లోతైన సమీక్షలో 26 థ్రాంబోఎంబోలిక్ కేసులు బయటపడ్డాయి.
ముప్పు తక్కువే..
కొవిషీల్డ్ టీకాతో ప్రతి 10 లక్షల డోసులకు 0.61 థ్రాంబోఎంబోలిక్ కేసులు నమోదవుతుండగా, కొవాగ్జిన్‌తో ఇప్పటివరకు ఈ తరహా కేసులు వెలుగుచూడలేదని ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
దేశంలో ఏప్రిల్ 3 నాటికి 7.54కోట్ల టీకా డోసులను వేసినట్లు జాతీయ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించింది. (కొవిషీల్డ్-6.86కోట్లు, కొవాగ్జిన్-67.8లక్షలు). వాటిల్లో 23వేలకు పైగా ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో 700 కేసులు మాత్రమే తీవ్రమైనవిగా నమోదయ్యాయి. అంటే 10 లక్షలకు 9.3 కేసులు మాత్రమే.
ఏఈఎఫ్ఐ డేటా ప్రకారం.. థ్రాంబోఎంబోలిక్ పరిణమించే అవకాశం చాలా తక్కువ. అయితే వచ్చే ప్రమాదం మాత్రం లేకపోలేదు. భారత్‌లో 10 లక్షల డోసులకు దాదాపు 0.61 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అది యూకేలోని 4 కేసులు (10లక్షలకు), జర్మనీలోని 10 కేసుల కన్నా చాలా తక్కువ. పైగా ఐరోపాతో పోలిస్తే దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో ఈ ముప్పు సంభవించే అవకాశం 70 శాతం తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
అయితే కొవిడ్ టీకా తీసుకున్న 20 రోజుల్లోపు థ్రాంబోఎంబోలిక్కు సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి, కాళ్లు, చేతుల్లో నొప్పులు, తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం, పక్షవాతం, చూపు కోల్పోవడం, మానసిక పరిస్థితిలో మార్పులను లక్షణాలుగా పేర్కొంది. అయితే వ్యాధులు సోకకుండా, కరోనా మరణాలను తగ్గించడంలో కొవిషీల్డ్ ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తోందని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఇదీ చూడండి:'సుదీర్ఘ పని గంటలతో గుండెకు ముప్పు'