Hanuman Jayanti 2023 : శ్రీరామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో హనుమాన్ జయంతి వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. శాంతి భద్రతల నిర్వహణ, హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకొనేలా.. మత సామరస్యానికి విఘాతం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈనెల 6న (గురువారం) దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
శ్రీరామ నవమి సందర్భంగా బంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ లేఖలు రాసింది. గుజరాత్‌లోని వడోదరలో రెండు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. ఫతేపురలో ఎవరికీ గాయాలు కాలేదని, కుంభర్‌వాడలో ఒక మహిళ సహా కొంతమంది గాయపడినట్లు పోలీసులు చెప్పారు. బంగాల్‌లోని హావ్‌డాలో ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దుండగులు పలు వాహనాలకు నిప్పుపెట్టి.. దుకాణాలను ధ్వంసం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఎమ్మెల్యే బిమాన్ ఘోష్ సమక్షంలోనే ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదంలో ఎమ్మెల్యే బిమాన్కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
బంగాల్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాదాపు 1000 ఊరేగింపులను నిర్వహించాయి. ఘర్షణ తలెత్తిన సమీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం గవర్నర్ ఘర్షణ ప్రాంతాల్లో పర్యటించారు. మత ఘర్షణలపై పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.