Heavy rains in Telangana: అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతన్న మీద వర్షం మరోసారి తన ప్రతాపాన్ని చూపనుంది. రాష్ట్రంలో రాగల 5రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలిపింది. వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ ద్రోణి రాయలసీమ నుంచి తెలంగాణ, మీదుగా దక్షిణ ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది.
వర్ష ప్రభావ జిల్లాలో సీఎం పర్యటన:ఇప్పటికే రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వడగళ్ల వర్షానికి మామిడి రైతులు కుదేలయ్యారు. భారీ ఈదురు గాలులకు మరికొద్ది రోజుల్లో చేతికి రాబోయే మొక్కజొన్న, వరి, పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం నిధులు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం: మొత్తం 2.28లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రస్తుతం అంచనా వేసినట్లు తెలిపారు. అందులో చాలా మంది రైతులు వందశాతం పంటలు నష్టపోయినట్లు తెలిపారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారంపై ఆదేశాలు జారీ చేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థికసాయంపై ప్రభుత్వ సీఎస్ జీవో జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిబంధనల మేరకు ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు పంట నష్టం వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.