ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు.. వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్‌లో ఈ ఘటన జరిగింది.
మత్తుమందు ఇచ్చి.. ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయిన వైద్యులు.. గంటల పాటు స్పృహ లేకుండానే..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చిన వైద్యులు.. అనంతరం ఆపరేషన్ చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలంతా గంటల పాటు సృహలో లేకుండా మత్తులోనే ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. రామ్‌నగర్‌లోని సీఎహెచ్సీలో సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్‌ను నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆపరేషన్లు జరగాల్సి ఉండగా.. మొత్తం 19 మంది మహిళలు క్యాంపునకు వచ్చారు. కాగా మరికొద్దిసేపట్లో డాక్టర్ వస్తారన్న సమయంలో.. పది మహిళలకు మత్తుమందు ఇచ్చారు వైద్య సిబ్బంది. అనంతరం అక్కడికి వచ్చిన డాక్టర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సౌకర్యాలు సరిగ్గాలేవని క్యాంపులో గందరగోళం సృష్టించారు. అనంతరం ఆపరేషన్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కొన్ని గంటల పాటు మహిళలంతా మత్తులోనే ఉన్నారు. ఘటనపై మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మెళకువ వచ్చాక జరిగింది తెలుసుకున్న.. మహిళలు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆపరేషన్ చేసుకోకుండానే ఇళ్లకు వెనుతిరిగి వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ అవధేష్ యాదవ్.. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా సీఎహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్ గుప్తా, డాక్టర్ అజిత్‌ను ఆదేశించారు. విచారణ అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.