Margaret alva MTNL: విపక్షాల ఉపరాష్ట్ర అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని.. భాజపాలోని తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయన్నారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు ఆళ్వ.
"ఈ కొత్త ఇండియాలో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నేతలతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. 'బిగ్‌బ్రదర్'కు అన్నీ తెలుస్తాయన్న భయం వారిలో కలుగుతోంది. అందుకే రెండు, మూడు ఫోన్లు వాడుతూ ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మార్చుతున్నారు. అంతేకాదు కలిసినప్పుడు కూడా గుసగుసలాడుకుంటూనే మాట్లాడుకుంటారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది."
-మార్గరెట్ ఆళ్వా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఈ సందర్భంగా ఎంటీఎన్ఎల్ సంస్థ నోటీసు పంపిన ఫొటోను షేర్ చేశారు ఆళ్వ. కేవైసీ సస్పెండ్ చేస్తున్నామని, మరో 24 గంటల్లో సిమ్ కార్డును బ్లాక్ చేస్తామని నోటీసులో ఉంది. అయితే ఇవి నకిలీ నోటీసులు అంటూ అంతకుముందే దిల్లీ పోలీసులు హెచ్చరించడం గమనార్హం. ఎంటీఎన్ఎల్ పేరు, లోగోను దుర్వినియోగం చేసి వాట్సాప్‌లో ఈ తరహా ఫ్రాడ్ మెసేజులు వస్తుంటాయని తెలిపారు. ఇది కేవైసీ స్కామ్‌లో ఒక రకమని తెలిపారు.
కేంద్రం క్లారిటీ: ఆళ్వా ఆరోపణలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకు ఏముందని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఆళ్వా చేసే ఆరోపణల్లో అర్థం లేదని.. ఓ సీనియర్ నేత అయ్యి ఉండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు జోషి.
ఇదీ చూడండి :కల్తీ మద్యం తాగి 22 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం