ఈ ఏడాది మార్చిలో ఉష్ణోగ్రతలు చాలా అధికంగా నమోదయ్యాయి. గత 121 ఏళ్ల మార్చి నెల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 2021 ఎక్కువ వేడి ఉన్న మూడో ఏడాదిగా తేలింది. ఈ మార్చిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. గత నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత 19.95 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 32.65, సగటు ఉష్ణోగ్రత 26.30 ఉన్నట్లు వివరించింది.
గతంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్‌తో అగ్రస్థానంలో ఉండగా.. 32.82 ఉష్ణోగ్రతతో 2004 రెండో స్థానంలో నిలిచిందని ఐఎండీ వెల్లడించింది.
కొన్ని ప్రాంతాల్లో గత మార్చిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఒడిశాలోని బారిపదాలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి, ఫిబ్రవరిల్లోనూ సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.