మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై బుధవారం కూడా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
పిటిషన్‌దారుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రదీప్ సంచేటి వాదనలు వినిపిస్తూ.. మరాఠాలు బలమైన సామాజిక, రాజకీయ వర్గమని తెలిపారు. 40 శాతం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ వర్గానికి చెందినవారేనని చెప్పారు. వారిని విస్మరించారని, చరిత్రాత్మక అన్యాయం జరిగిందని చెప్పడం సరికాదని తెలిపారు. వారు రిజర్వేషన్లు పొందడం భావ్యం కాదని అన్నారు. మరాఠాలు సామాజికంగా వెనకబడ్డారని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందంటూ 2018లో ఎం.జి.గైక్వాడ్ కమిటీ ఇచ్చిన నివేదిక అసంబద్ధమని చెప్పారు. అధ్యయనం కూడా శాస్త్రీయ పద్ధతుల్లో జరగలేదని తెలిపారు. ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే 50 శాతం పరిమితికి లోపలే ఉండాలే తప్ప, అంతకుమించకూడదని తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని న్యాయస్థానాలు చెప్పాయని, మరాఠాల విషయంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.