Maratha Reservation All Party Meeting :మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే వెల్లడించారు. ముంబయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు.. చట్టప్రకారం జరగాలని ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని.. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలు, శాంతియుత ఆందోళనలకు చెడ్డపేరు తెస్తున్నాయన్న ఆయన.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. సామాన్యులు అభద్రతాభావం కలిగేలా వ్యవహరించవద్దని నిరసనకారులకు సూచించారు.
Maratha Reservation Issue : ఈ సందర్భంగా కోటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించాలని నేతలు ఓ తీర్మానం చేశారు. దానిపై సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే తరఫున హాజరైన అనిల్ పరాబ్‌లు సంతకాలు పెట్టారు. చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంచెం సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని శిందే కోరారు. ఈ విషయంపై జరంగే కూడా ప్రభుత్వానికి సహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో పాటు.. ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. కానీ, మరాఠా రిజర్వేషన్ల ఆవశ్యకత దృష్ట్యా తమ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు ఆ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు.
అంతకముందు మీడియాతో మాట్లాడిన మరాఠా ఉద్యమనేత జరంగే.. తమకు ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం కుంబీ కులంలో చేర్చితే సరిపోతుందని చెప్పారు. మరాఠాలు కుంబీ కులానికి చెందిన వారని.. ఆ కులం ఓబీసీ కేటగిరీ కిందకి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరాఠా సామాజిక వర్గ ప్రజలకు అధికారులు కొత్తగా కుంబీ కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వారు ఓబీసీ ప్రయోజనాలు పొందే అవకాశం లభించినట్లయింది.