తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇదా వారు కలలు కన్న స్వేచ్ఛాభారతం? - గుంటూరు మహిళ హత్య కేసు

ఏ రోజు దినపత్రికలు తిరగేసినా, టీవీ ఛానళ్లు తిలకించినా- ఆడపిల్లల మానాభిమానాల్ని చెరపట్టే గాంధారి కొడుకులు గల్లీకొకడుగా దాపురించిన వైపరీత్యానికి అవి అద్దం పడుతున్నాయి. అచ్చోసిన మృగాళ్ల విచ్చలవిడితనానికి ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం అనేముంది- దేశం నలుమూలలా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు పోగుపడుతున్నాయి. దేశంలో మహిళలెవరికీ ఎక్కడా భద్రత లేనేలేదని ఈ ఘటనలు ఎలుగెత్తుతున్నాయి. ఇదా అలనాటి స్వాతంత్య్ర సమర సేనానులు కలలు కన్న స్వేచ్ఛాభారతం?

crime on women
మహిళలపై నేరాలు

By

Published : Aug 22, 2021, 8:46 AM IST

నడిరేయి వేళ మహిళలు నిర్భయంగా తిరిగి రాగలిగినప్పుడే భారత్‌ బంధవిముక్తమైనట్లు పరిగణించాలనేవారు జాతిపిత. అర్ధరాత్రి వరకు ఎందుకు, పట్టపగలు నడిరోడ్డుమీద ఓ అమ్మాయిని కత్తితో కసిగా పొడిచి పారేసినా ఎవరూ పట్టించుకోని దుస్థితిలో కూరుకుపోయిన దేశం... ఏ నరకానికి, ఎంతటి దౌర్భాగ్యానికి సరిపోలిక? ఈ నెలలోనే స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉదయం పదిగంటల వేళ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారిలో ఇరవై ఏళ్ల బీటెక్‌ విద్యార్థినిని ఒక యువకుడు అందరూ చూస్తుండగానే అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ ఘటన మరుగున పడకముందే నిన్నకాక మొన్న విజయనగరంలో- కాబోయే భార్యమీద అనుమానంతో ఓ పురుషపుంగవుడు కాలయముడయ్యాడు. చీకటి మాటున యువతి ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్న ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. కరడుగట్టిన కర్కశత్వానికి నకళ్లుగా దిగ్భ్రమపరుస్తున్న ఈ ఉదంతాలు, మగపుటక పుట్టామన్న దురహంకారుల పైశాచికత్వానికి మచ్చతునకలు.

గాంధారి కొడుకులు గల్లీకొకడుగా..

ఏ రోజు దినపత్రికలు తిరగేసినా, టీవీ ఛానళ్లు తిలకించినా- ఆడపిల్లల మానాభిమానాల్ని చెరపట్టే గాంధారి కొడుకులు గల్లీకొకడుగా దాపురించిన వైపరీత్యానికి అవి అద్దం పడుతున్నాయి. అచ్చోసిన మృగాళ్ల విచ్చలవిడితనానికి ఆ రాష్ట్రం, ఈ ప్రాంతం అనేముంది- దేశం నలుమూలలా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు పోగుపడుతున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ క్రోడీకరించిన సమాచారం ప్రకారం, ఈ పోతుగడ్డపై రోజూ సగటున 87 అఘాయిత్యాలు నమోదవుతున్నాయి. అంటే, ఏటేటా 31వేలకుపైగా కీచక ఉదంతాలు అధికారికంగా వెలుగు చూస్తున్నాయి. రికార్డులకు ఎక్కకుండా చీకట్లోనే మరెన్ని అకృత్యాల సమాచారం మలిగిపోతున్నదో ఎవరికెరుక? ఒంటరి మహిళల్ని, నిస్సహాయ స్థితిలోని అమ్మాయిల్ని లక్ష్యంగా చేసుకుని పేట్రేగిపోతున్న మదోన్మత్తుల అరాచకాల సంఖ్య పోనుపోను పెచ్చరిల్లుతోంది.

ఇదేనా స్వేచ్ఛాభారతం?

సుమారు పక్షం రోజులక్రితం మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకుడు ఆమెను చంపేసి, అడవిలో ఒక చెట్టుకు శవాన్ని వేలాడదీశాడు. నెల్లాళ్లక్రితం యూపీలోని బాగ్‌పత్‌లో పదిహేనేళ్ల బాలికపై- ఆ అమ్మాయికి వల విసిరిన వ్యక్తి, అతడి సోదరులు, స్నేహితులు పలుమార్లు అకృత్యానికి పాల్పడిన ఉదంతం గగ్గోలు పుట్టించింది. మూడు నెలల క్రితం ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం, ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకుంటానని నమ్మబలికి మహిళను వంచించారన్న ఆరోపణతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో భాజపా ఎమ్మెల్యేపై కేసు నమోదు, ఝార్ఖండ్‌లోని పాలమూ జిల్లాలో పదమూడేళ్ల బాలికను లొంగదీసుకుని తరగతి గదిలోనే విషమిచ్చి హతమార్చిన ఉపాధ్యాయుడి ఘాతుకం... ఎవరికీ ఎక్కడా భద్రత లేనేలేదని ఎలుగెత్తుతున్నాయి. ఇదా అలనాటి స్వాతంత్య్ర సమర సేనానులు కలలు కన్న స్వేచ్ఛాభారతం?

విషసంస్కృతి వెర్రితలలు వేస్తూ..

మహిళలు, ఆడపిల్లలపై ఆటవిక హింసాకాండకు మూలాలు శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిక్య భావజాలంలో ఉన్నాయన్నది, దాదాపు రెండేళ్లనాడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన అర్థవంతమైన విశ్లేషణ. మగబుర్రల్లో తిష్ఠవేసిన ఆభిజాత్యాన్ని కుదుళ్లతో సహా పెళ్ళగించే గట్టి యత్నాలేమైనా దేశంలో చోటుచేసుకున్నాయా? 'తాను భద్రంగా ఉన్నానని భారత మహిళ ఎప్పుడు భావించగలుగుతుంది?' అని ప్రశ్నిస్తూ 2013 గాంధీజయంతి నాడు నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. అప్పటికి ఇప్పటికి సమాధానం ఒక్కటే- ఏమో! 'నేను పుట్టి పెరిగిన భారతావని మౌలిక సంస్కృతి ఇది కాదు!' అని అరుంధతీరాయ్‌ వంటివారు ఆక్రోశించేంతగా- మానవమృగాలు చెలరేగిపోతున్నాయి. ఎవరెంతటివారైనా తప్పుచేసి తప్పించుకోలేరన్న భీతి కొల్లబోయిన వాతావరణంలో విషసంస్కృతి వెర్రితలలు వేస్తూ నేరగాళ్లలో పశుప్రవృత్తి ఎగదన్నుతోంది. కుసంస్కారం కుబుసం విడుస్తోంది. ఈ భ్రష్టపోకడలకేదీ సరైన విరుగుడు?

భరతం పట్టాలి.. కంతల్నీ పూడ్చాలి..

లైంగిక దాడులకు, నేరాలకు పాల్పడినవాళ్లపై రెండు నెలల్లోగా అభియోగపత్రాలు దాఖలు కావాలని సర్వోన్నత న్యాయస్థానం లోగడ నిర్దేశించినా- వాస్తవిక కార్యాచరణ చురుకందుకొనకపోవడం ప్రేమోన్మాదులకు, మదోన్మత్తులకు కోరలు తొడుగుతోంది. కేసుల సత్వర విచారణ, దరిమిలా కఠిన శిక్షల అమలు ప్రక్రియ ఊపందుకోవాల్సిందే. ఆడపిల్లలపై పాశవిక దాడుల్ని కేవలం శాంతిభద్రతల సమస్యగానే పరిగణించకూడదు. చురుగ్గా దుండగుల భరతం పట్టడంతోపాటు- ఇంతటి దారుణ దురవస్థకు కారణమైన కంతల్నీ పూడ్చాలి. అంతర్జాలం, అశ్లీల సాహిత్యం, మత్తు పదార్థాలు, పబ్‌ సంస్కృతి... మనిషిలోని రాక్షసుణ్ని రెచ్చగొడుతున్నాయి. యాంత్రిక జీవన విధానంలో తల్లిదండ్రులూ తమ సంతానం ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో పట్టించుకొనకపోవడం పిల్లల్లో మానవీయ భావనల్ని కదలబారుస్తున్నాయి.

బీజం ఇంట్లోనే పడాలి..

రేపటితరంలో సభ్యత సంస్కారం ఉట్టిపడాలంటే- అందుకు బీజం ఇంట్లోనే పడాలి. ఆడపిల్లల పట్ల గౌరవంగా హుందాగా ప్రవర్తించాలన్న భావం బాల్యదశలోనే నాటుకునేలా పాఠ్యాంశాల్నీ ప్రక్షాళించాలి. అమ్మాయిల్ని వేధించి, హింసించి వినోదించడమే హీరోయిజమన్న దుర్భ్రమల్ని చెదరగొట్టేలా- నవభారతావనికి నైతిక విద్యాబోధనతో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా కొత్త ఒరవడి దిద్దాలి. ఈ సామాజిక చికిత్సను సత్వరం సాకారం చేయడంలో ప్రజాప్రభుత్వాలు నిబద్ధత కనబరిస్తేనే- స్త్రీజాతి భద్రత పట్ల అవి శ్రద్ధ చూపించినట్లు. ఏమంటారు?

- బాలు

ఇదీ చూడండి:minor girl raped: వెంటబడిన మానవమృగం కాళ్లు.. కామంతో మూసుకుపోయిన కళ్లు!

ఇదీ చూడండి:గుంటూరు జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై ఇద్దరు మృగాళ్ల అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details