Manikonda Jagir Case: హైదరాబాద్ మహానగరం మణికొండ జాగీర్ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర సర్కారు చూపిన చొరవను ధర్మాసనం ప్రశంసించింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించిన ల్యాంకో హిల్స్, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ, ఐఎస్‌బీ సహా పలు సంస్థలు, వ్యక్తులకు ఊరట లభించింది.
వివాదం మొదలైందిలా..
Manikonda Jagir issue: మణికొండ జాగీర్ పరిధిలోని ముతావలీ ఇల్లు, భూమి కలిపి 5,506 చదరపు గజాలు తమ పరిధిలోనిదంటూ ఏపీ వక్ఫ్‌బోర్డు 1989, ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ జారీచేసింది. దానిని సవరిస్తూ మణికొండ జాగీర్ పరిధిలోని 1654.32 ఎకరాల భూమి తమ పరిధిలోనిదేనంటూ 2006, మార్చి 13వ తేదీన మరో సవరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ల్యాంకో హిల్స్ సహా పలు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు భూములు అప్పగించింది.
ఈ నేపథ్యంలో ఏపీ వక్ఫ్‌బోర్డు సవరించిన నోటిఫికేషన్ ఆధారంగా ఆ భూములన్నింటినీ వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలంటూ మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్ తదితరులు హైకోర్టు, ఏపీ వక్ఫ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు ఈ కేసును విచారించి వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, ల్యాంకో హిల్స్, ఇతర సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల తరఫున సుప్రీంకోర్టులో 2012లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
పిటిషన్లు విచారణలో ఉండగానే రాష్ట్ర విభజన జరగడంతో కేసును తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ కొనసాగించాయి. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 156 పేజీల తీర్పును సోమవారం వెలువరించింది. "ఈ కేసులో 2012, ఏప్రిల్ 3వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నాం. సివిల్ అప్పీళ్లను స్వీకరిస్తున్నాం. వక్ఫ్‌బోర్డు 2006, మార్చి 13న జారీచేసిన సవరణ నోటిఫికేషన్‌ను రద్దుచేస్తున్నాం. 1654.32 ఎకరాల భూమి సర్వ హక్కులతో రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది. కమ్యుటేషన్ నిబంధనల ప్రకారం దర్గాకు బకాయిలు చెల్లించాల్సి ఉంటే ఆరు నెలల్లో చెల్లించాలి" అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఆస్తులను కాపాడుకోవడానికి వ్యక్తుల మాదిరే రిట్‌ల ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చని, వక్ఫ్‌బోర్డు తనదని ప్రకటించుకున్న 1654.32 ఎకరాల భూమిని దక్కించుకునేందుకు రాష్ట్ర సర్కారు సమర్థంగా వ్యవహరించిందని కొనియాడింది.
నోటిఫికేషన్‌కు సర్కారు కట్టుబడాలని లేదు
Lanco Hills Manikonda: తీర్పులో ధర్మాసనం పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. "వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ధార్మిక, మత ప్రయోజనాలకు కేటాయించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండకూడదనే నిబంధనేమీ లేదు. 1954, 1995 చట్టాల ప్రకారం వక్ఫ్ బోర్డు అనేది చట్టబద్ధమైన సంస్థే. అది దాని పరిధిలో ఏ నోటిఫికేషనైనా వెలువరించవచ్చు. అంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం దానికి కట్టుబడాలని లేదు. అధికారిక గెజిట్‌లో నోటీసును ప్రచురించడమనేది సామాన్య ప్రజలకు అవగాహన కలిగించేందుకు వార్తా పత్రికలో ప్రకటన ప్రచురించడం వంటిది. అందువలన గెజిట్‌లో ప్రచురించిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండదని" పేర్కొంది.