Mangalore animal lover: మూగజీవాల పట్ల అపార ప్రేమను చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు కర్ణాటక మంగళూరుకు చెందిన జంతుప్రేమికురాలు రజనీ శెట్టి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 వీధి శునకాలు ఆకలి తీర్చుతూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. రోజు 200 కేజీల రైస్- చికెన్‌తో శునకాల కడుపు నింపుతున్నారు. వాటిని సొంత బిడ్డల్లా ఏ లోటు రాకుండా సేవలందిస్తున్నారు.
రజనీ శెట్టి 15 ఏళ్ల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ఒక రోజు ఓ వ్యక్తి ఆమ్లెట్ తిన్న పేపర్‌ను పడేయగా.. ఆకలితో ఉన్న ఓ శునకం దాన్ని తింది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన రజనీ వెంటనే అదే షాపులో ఆమ్లెట్ కొనుక్కొచ్చి మూగజీవి ఆకలి తీర్చింది. అనంతరం ఆ శునకం మొహంలో చూసిన ఆనందం రజనీని తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి తనకు తారసపడ్డ వీధి శునకాల ఆకలి తీర్చుతూ వస్తోంది. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరిగి ఇప్పుడు 800కు చేరింది. జంతువుల పట్ల ఈమె ప్రేమను చూసిన చాలా మంది దాతలు సాయం చేసేందుకు ముందుకువచ్చారు.
Animal lover rajani shetty
రజనీ మంగళూరులో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మూగజీవాల పరిరక్షణలో భర్త, ముగ్గురు పిల్లలు కూడా ఆమెకు వెన్నంటే ఉంటున్నారు.
800 శునకాలతో పాటు పక్షులు, పిల్లులు సహా మరో 60 జీవాలు కూడా రజనీ సంరక్షణలో ఉంటున్నాయి. అవి బలహీనంగా ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆకలితో అలమటిస్తున్నా రజనీ వెంటనే ఇంటికి తీసుకెళ్లి సేవలు చేస్తారు. వాటి బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు.
rajani shetty animal rescue